Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంజుహీ చావ్లా కదిలించిన 5G రేడియేషన్ తేనె తుట్టె!

జుహీ చావ్లా కదిలించిన 5G రేడియేషన్ తేనె తుట్టె!

2G కి కాలం చెల్లింది.
3G మొహం మొత్తింది.
4G పాతబడింది.
ఇక 5G రావాల్సిందే.
చైనాలో వచ్చింది.
ఇంకెక్కడో ఎప్పుడో వచ్చింది.
మనకే ఆలస్యమవుతోంది.

అర చేతి స్మార్ట్ ఫోనే ఇప్పుడు మాట్లాడే ఫోన్. వినే రేడియో. చూసే టీ వి. క్లిక్ మనిపించే కెమెరా. లెక్కలు తేల్చే క్యాలిక్యులేటర్. డిజిటల్ ఫైళ్లు దాచుకునే బీరువా. డబ్బు చెల్లించే డిజిటల్ చెక్కు బుక్కు. గూగులించగలిగే సెర్చ్ ఇంజిన్. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్, సిగ్నల్…సకల డిజిటల్ ప్రపంచానికి అనుసంధానం.

నడుస్తూ సెల్ మాట్లాడాలి.
మాట్లాడుతూ సెల్ చూడాలి.
చూస్తూ మెసేజ్ చేయాలి.
మెసేజ్ చేస్తూ ఆడియో వినాలి.
వింటూ ఇంకేదో చూడాలి.
పంచేంద్రియాలను పరిమార్చి ఏమార్చి మార్చి మార్చి సెల్ ఫోన్ లోకే తలదూర్చి ఉండాలి. డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ సెల్ మాట్లాడకపోతే మనకు టేబుల్ మ్యానర్స్ లేనట్లు. కాలకృత్యాలు తీర్చుకుంటూ సెల్ తో అనుసంధానం కాకపొతే మనం ఆధునిక మానవులం కానట్లు.

ఇంతగా మనిషి జీవితంలో భాగమయిన సెల్ ఫోన్ పనిచేయడానికి సెల్ టవర్ నుండి వచ్చే సిగ్నల్ ఆధారం. ఆ టవర్ కు ఉపగ్రహంలో కేటాయించిన బ్యాండ్ విడ్త్ కీలకం. ద్రవ ఇంధనమో, కరెంటో, బ్యాటరినో ఏదో ఒక శక్తి పంప్ చేస్తేనే ఉపగ్రహమయినా, టవరయినా, సెల్ ఫోన్ అయినా పని చేస్తాయి.

టవర్ కు సెల్ కు మధ్య రేడియేషన్ ఉంటుంది. టవర్ చుట్టూ రేడియేషన్ ఉంటుంది. చెవికి ఆనించి గంటలు గంటలు సెల్ మాట్లాడితే రేడియేషన్ ప్రభావం మెదడు మీద పడుతుంది. మనతోపాటు జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు, చెట్టు చేమ అన్నీ రేడియేషన్లతో ఇబ్బంది పడుతున్నాయి.

మెదడు మీద సెల్ టవర్ల రేడియేషన్ దుష్ప్రభావం మాటల్లో చెప్పలేనంత ఉంటుందన్నది ఒక వాదన. ఉండదన్నది ఒక వాదన. రిమోట్ కు టీ వీ కి మధ్యలో కూడా కంటికి కనిపించని సంకేతాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్నెన్నో ఎలెక్ట్రానిక్ పరికరాల మధ్య సెల్ రేడియేషన్ కూడా ఒకటి. డ్యామేజ్ ఉన్నా వాడక తప్పని పరిస్థితి అని వాడుతున్నవారే అధికం. సెల్ లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టమయిన రోజులొచ్చాయి.

ఇలాంటి వేళ 5G ని ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని నటి, పర్యావరణ ప్రేమికురాలు జుహీ చావ్లా ఢిల్లీ కోర్టులో కేసు వేసింది. కేసు విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందో తరువాత సంగతి.

ఆమె చెబుతున్నట్లు 5G వల్ల మన మెదళ్లకు, ఇతర ప్రాణులకు, చెట్లకు హాని జరుగుతుందా? లేదా? అన్నది మాత్రం శాస్త్రీయంగా తేలాల్సి ఉంది.

ఒకవేళ సెల్ టవర్ల రేడియేషన్ల వల్ల హాని జరుగుతుందని రుజువయితే-
సిగరెట్టు పెట్టెల మీద భయంకర వ్యాధి చిత్రాలను ముద్రించి హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు – సెల్ ఫోన్ వెనుక చిన్న మెదడు చిట్లే చిన్న చిత్రాలను ముద్రిస్తే సరిపోతుంది!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్