Saturday, January 18, 2025
HomeTrending Newsఅమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలా హర్రీస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలా హర్రీస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తే పార్టీ అభ్యర్థిగా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హర్రీస్ అధ్యక్ష బరిలో ఉంటారని బైడెన్ సూత్రప్రాయంగా వెల్లడించారు.

జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై అభాసుపాలవటం.. ఇటీవల ఎన్నికల చర్చలో ట్రంప్ ధాటిని నిలువరించకపోవటంతో ఆయన అభ్యర్థిత్వం మార్చాలని పార్టీలో, బయట తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఒకటి రెండు సందర్భాల్లో ఈ అంశం ప్రస్తావనకు రాగా పోటీ నుంచి తప్పుకునేది లేదని బైడెన్ తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి బైడెన్ అభ్యర్థిత్వానికి పార్టీలో సమ్మతి వచ్చింది. ఈ తరుణంలో పోటీ నుంచి తప్పుకోవాలంటే పార్టీ నిబంధనల ప్రకారం అభ్యర్థి స్వయంగా ప్రకటిస్తే కాని… ఆయన అభ్యర్థిత్వం మార్చే అధికారం పార్టీలో ఎవరికీ లేదు.

మరోవైపు డోనాల్ ట్రంప్ మీద హత్యాయత్నం జరిగాక రిపబ్లికన్ పార్టీ పరిస్థితి మెరుగుపడిందని వివిధ సర్వేల్లో వెల్లడైంది. రాబోయే ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఖాయమని వార్తలు వస్తున్నాయి. తాజాగా బైడెన్ ప్రకటనతో అమెరికా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

భారతీయ మూలాలు ఉన్న కమల హర్రీస్ అధ్యక్ష అభ్యర్థిగా రంగంలోకి దిగితే అమెరికాలోని భారతీయులతోపాటు ఆసియ ఖండ దేశాల ప్రజలు కమల వైపు మొగ్గే అవకాశం ఉంది. ఆమెకు భారతీయ నేపథ్యం ఉన్నా కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసినపుడు పాకిస్తాన్ కు వంత పాడారు. కాశ్మీర్ అంశంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలాంటి నేత అధ్యక్షురాలైనా ఇండియాకు ఎంత మేలు జరుగనుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకుల భావన. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఉన్నా భారత్  ఒనగూడింది లేదు. అదే రీతిలో ఉంటుందని అంటున్నారు.

దౌత్య పరంగా రిషి సునాక్ ఏలుబడిలో భారత్ తో ప్రతిష్టాత్మక ఒప్పందాలు జరగక పోయినా… ప్రధాని ఇంట దీపావళి వేడుకలు, భారత సంస్కృతి.. హిందూ ఆచార వ్యవహారాలు సర్వత్ర చర్చకు వచ్చాయి. భారతీయ పండుగలైన హోలీ, దీపావళి, జగన్నాథ రథయాత్ర తదితర వేడుకలకు అంతటా ఆమోదం లభించింది.

బ్రిటన్, అమెరికా తదితర అగ్రరాజ్యాల్లో భారతీయులు సత్తా చాటడం… ప్రపంచ దేశాల్లో ఇండియా ప్రతిష్ట ఇనుమడిస్తుందనటంలో సందేహం లేదు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్