Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకామరాజ్ ఓ కర్మవీరుడు

కామరాజ్ ఓ కర్మవీరుడు

తమిళనాడుకు చెందిన గొప్ప రాజకీయ నేతలలో కామరాజర్ ఒకరు. ముఖ్యమంత్రిగా ప్రజలకు చక్కని పరిపాలన చేసిన నేతగా చరిత్రపుటలకెక్కిన కామరాజర్ ఓమారు తంజావూరు జిల్లాలోని అతి పురాతన ఆలయాన్ని సందర్శించారు. అది శిథిలావస్థలో ఉన్నప్పటికీ నిర్మాణకౌశలాన్ని ఆయన ప్రశంసిస్తూ ఈ ఆలయాన్ని ఎవరూ నిర్మించారు అని ప్రశ్నించారు. ఆయన వెంట ఉన్న అధికారులకు జవాబు తెలీక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. విషయం గ్రహించిన కామరాజర్ ఓ నవ్వు నవ్వి ఆలయాన్నెవరు కట్టారో తెలీకపోవడం అటుంచితే ఈ ఆలయానికి ట్యూబ్ లైట్ ప్రదానం చేసిన వ్యక్తి పేరు తాటికాయంత అక్షరాలతో చక్కగా రాసారు. పైగా నెల కూడా పని చేయని ట్యూబ్ లైట్ అది అని చెప్పగా అక్కడున్న వారందరూ గొల్లున నవ్వారు.

ఆయనొకమారు ప్రయాణికుల విడిదిలో బస చేసినప్పుడు విషయం తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పూలమాల వేసి తమ అభిమానాన్ని చాటుకోవడానికి వచ్చారు. వారిలో ఓ ఉపాధ్యాయుడు కూడా ఉన్న సంగతి తెలిసి కామరాజర్ ఆయనను చూసి “ఏమయ్యా! చదువుకోనివారికి పాఠాలు చెప్పవలసిన మీరు చదువుకోనివాడికి పూలదండవేయడానికి వచ్చారేమిటీ?” అని అడిగారు. ఆ మాటలకు ఉపాధ్యాయుడు కళ్ళు తడిసాయి.

కామరాజర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన తల్లి శివకామి అమ్మయార్ ఖర్చులకోసం నెలకు నూట ఇరవై రూపాయలు పంపుతుండేవారు. ముఖ్యమంత్రి తల్లి కావడంతో ఆమెను చూడటానికి రోజూ పార్టీకి చెందినవారో సన్నిహితులో తపరిచయస్తులో వచ్చిపోతుండేవారు. అలా వచ్చి వెళ్ళినవారికి ఆమె కాఫీలూ సోడాలూ ఇస్తుండేవారు. అయితే తనకిస్తున్న డబ్బులు సరిపోవడం లేదని ఆమె కొడుకు కామరాజర్ కి కబురు పంపి ప్రతి నెలా అదనంగా మరో ముప్పై రూపాయలు కావాలని అడిగారు.

అప్పుడు కామరాజర్ “ఎవరెవరో ఇంటికి రావచ్చు. కాదనను. అలా వస్తున్న వాళ్ళందరూ తమకు సోడా కాఫీ కావాలని అడుగుతారా? నేనిచ్చే నూట ఇరవై రూపాయలలోనే సర్దుకోమను. ఒకవేళ నేను అదనంగా ముప్పై రూపాయలు పంపితే తన దగ్గర డబ్బులు ఎక్కువై గుడి గోపురం అంటూ యాత్రలు చేయడం మొదలుపెడుతుంది. అలా తిరగడం ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక ఇప్పుడు పంపుతున్న నూట ఇరవై రూపాయల్లోనే ఖర్చులను సరిపెట్టుకోమను” అంటూ జవాబిచ్చా‌రట.

ముఖ్యమంత్రిగా పరవీబాధ్యతలు చేపట్టిన తొలి రోజున ఫైళ్ళు చూడటానికి ఉపక్రమించారు. ఆయన ముందు బల్ల మీద రెండు వరసలలో ఫైళ్ళున్నాయి. అయితే ఆ రెండు వరసలూ ఏమిటీ అని అడిగారు.

అప్పుడు అక్కడున్న అధికారి “మొదటి వరుసలో ఉన్నవి అర్జంట్ ఫైళ్ళండి. ముఖ్యమైనవండి. రెండో వరుసలో ఉన్నవి ముఖ్యమైనవి కావండి” అని వివరంగా చెప్పారు.

అయితే కామరాజర్ ఆ మాట విని విస్తుపోయారు. ముఖ్యమంత్రి దగ్గరకొచ్చే ఫైల్ ఏదైనాసరే ముఖ్యమైనవే. అంతేతప్ప ముఖ్యమైనవి కావు. ముఖ్యమైనవి అనే తేడాలు ఉండకూడదు. నాకు ప్రతి ఫైలూ ముఖ్యమే” అన్నారు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ చాలా విభాగాల్లో చాలా మందికి తగినంత పనులు లేవని, వారిని ఉద్యోగాల నించి తీసేస్తే ప్రభుత్వానికి అనేక లక్షల రూపాయలు మిగులుతాయని సూచించారు.

ఆ ఫైల్ ను చదివిన కామరాజర్ “234 మందిని తీసేసేమని సిఫారసు చేసారు. వాళ్ళందరూ డిగ్రీ చేశారు.అయిదేళ్ళుగా ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నారు. వాళ్ళను నమ్ముకుని కుటుంబాలున్నాయి.వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేస్తే వాళ్ళ కుటుంబాలు వీధినపడతాయి. అది మహాపాపం. వాళ్ళకు తగినంత పని లేదనిపిస్తే మరేవైనా పనులు అప్పగించండి. పనులు చేయించండి. ప్రభుత్వ ఖజానానే నాకు ముఖ్యం కాదు. ప్రభుత్వాన్ని నమ్ముకుని బతుకుతున్న ఉద్యోగస్తుల సంక్షేమమూ నాకు ముఖ్యం” అన్నారు.

తనను చూడటంకోసం, పనులకోసం ఐఎఎస్ అధికారులు వచ్చినప్పుడు కామరాజర్ తన సహాయకుడిని పిలిచి వీధిలో పోతున్న దినసరి కూలీలలను పేదవాళ్ళను పిలిపించి అధికారుల ముందు వారి బాగోగులు అడిగితెలుసుకునేవారు. మీకు రేషన్ షాపుల్లో బియ్యం పప్పులు సక్రమంగా లభిస్తున్నాయా? ధరలు ఎలా ఉంటున్నాయి? మీకే సమస్య వచ్చినా అధికారులతో చెప్పండి. వాళ్ళు మీ సమస్యల పరిష్కారానికే ఉన్నారు” అని చెప్పి పంపించేవారు.

ఇలాటి కామరాజర్ జీవిత చరిత్ర చదువుతుంటే ఇప్పుడున్న నేతలలో ఏ ఒక్కరైనా ఇలా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్