Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇంతకూ మనకు స్వాతంత్ర్యం వచ్చిందా?

ఇంతకూ మనకు స్వాతంత్ర్యం వచ్చిందా?

We Got True Freedom in 2014: Kangana Ranaut

అరెరే!
ఎంతపని జరిగింది?
డెబ్బయ్ అయిదేళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్నాం కానీ…ఆ వచ్చిన స్వాతంత్ర్యం స్వరూప, స్వభావ, పూర్వాపరాలను పట్టించుకోకుండానే రెండు, మూడు తరాలు దొర్లిపోయాయి.

స్వతంత్రం తనకు తాను వచ్చిందా?

స్వతంత్రం మనం తెచ్చుకున్నామా?

స్వతంత్రం ఒకరు ఇస్తేనే మనం తీసుకున్నామా?

స్వతంత్రం బ్రిటీషువారు భిక్షగా మన బొచ్చెలో వేసి వెళ్లారా?

దేశానికి 2014 వరకు అసలు స్వాతంత్ర్యమే రాలేదా?

కంగనా రౌనత్ అనే ఒకానొక మగధీర ఇన్నాళ్లకయినా 2014 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని బల్లగుద్ది మరీ చెప్పబట్టి సరిపోయింది. లేకపోతే అనవసరంగా 1947 లో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని పొరబడేవాళ్లం!

కంగనా ఏమీ కంగారులో మాట్లాడదు. ఆమె మాటలకు, చేతలకు కొన్ని లెక్కలుంటాయి. మీడియా దృష్టిని ఆకర్షించే ఎత్తుగడలు ఉంటాయి. వార్తల్లో ప్రముఖంగా ఉండడానికి అవసరమయిన పంచ్ డైలాగులుంటాయి.

అప్పటికే పెళ్లయిన నటుడిని ప్రేమించి, అతను మోసం చేసి, గేలి చేస్తే…అదే బాంబే రోడ్ల మీద మొండిగా నిలబడి…అతడికి బహిరంగ సవాలు విసిరి…ఒక్కో ఇటుక పేర్చుకుంటూ కూలిన తన కలల సౌధాన్ని తిరిగి నిర్మించుకున్న వనితగా కంగనాను అభినందించాల్సిందే. పురుషాధిక్య సినీమాయా ప్రపంచంలో హిమాచల్ చల్లని ప్రాంతం నుండి వచ్చిన మెత్తటి మనిషి కంగనా ఉక్కు మనిషిగా మారడం వరకు ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఆమె రాజకీయ అభిప్రాయాలు, వాటిని వ్యక్తం చేసే పద్ధతులు విచిత్రంగా ఉంటాయి.

దేశంలో ఇప్పుడు ఎవరికయినా రెండు రకాల చూపులే ఉండాలి. ఒకటి- ఎడమ చూపు. రెండోది- కుడి చూపు. కంగనాది కుడి చూపు. అందుకు తగ్గ అవార్డులు, ఇతర ప్రతిఫలాలు ఆమెకు వస్తున్నాయి. దానికి మనం అసూయపడి ప్రయోజనం లేదు.

సాధారణ స్థాయి నుండి సెలెబ్రిటీలు కాగానే వారిలో జ్ఞానం పొంగి పొర్లుతూ ఉంటుంది. లోకానికి జ్ఞాన భిక్ష పెట్టాలన్న తహతహ పెరిగిపోతుంది. పాడులోకాన్ని చీకట్లో నుండి బయటకు తీసుకురావడానికి తమ జ్ఞాన దీపమే శరణ్యమని వారికి బలంగా అనిపిస్తూ ఉంటుంది. తమ జ్ఞానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా చెప్పాలన్న బలహీనత ఏర్పడుతుంది.

అలా ఒకానొక బలహీన సందర్భంలో కంగనా తన జ్ఞానంతో మన స్వాతంత్ర్యం తేదీని మార్చింది. 1947 పవిత్రత, దాని స్ఫూర్తి, దాని పరవశం తెలియనంత నంగనాచి ఏమీ కాదు కంగన. ప్రధాని మోడీ, బి జె పి మనసు గెలవడమే ఆమె ఉద్దేశం. దేశం మొత్తం ఒక్కసారిగా తన మీద పడాలన్నదే ఆమె ఎత్తుగడ. రోగి కోరింది…వైద్యుడు చెప్పింది ఒకటే అయినట్లు…ఆమె కోరుకున్నట్లే దేశం స్పందిస్తోంది. ఆమెకు కావాల్సింది అక్షరాలా ఇదే!

రేప్పొద్దున కంగనకు బి జె పి తో చెడితే…అసలు ఈ దేశానికి ఇప్పటికింకా స్వాతంత్ర్యమే రాలేదు పొమ్మంటుంది. అసలు స్వాతంత్ర్యం రాని అస్వతంత్రుల కంటే…కంగన ఖంగున చెప్తున్నట్లు 2014 లో స్వతంత్రులం కావడం కొన్ని కోట్ల రెట్లు నయం!

2014 లెక్క ప్రకారం 2024 లో దేశ స్వాతంత్ర్య తొలి దశాబ్ద మహోత్సవ సంరంభాల్లో ముందువరుస అతిథి కంగనమ్మే అవుతుందేమో!

అవునూ…
ఇప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో కూడా స్వాతంత్ర్యం సిద్ధించిన సంవత్సరాన్ని మార్చాలా?
లేక…
భిక్షా స్వాతంత్ర్యం- 1947
అసలు స్వాతంత్ర్యం- 2014
అని స్పష్టంగా తిరగరాయలా?

“మన స్వాతంత్ర్యం మేడి పండు-
మన దరిద్రం రాచపుండు”
అన్న ఆరుద్ర కవిత కంగనకు తెలిసే అవకాశం లేదు.
తెలిస్తే…
“మన స్వాతంత్ర్యం మేడి పండు-
అది 2014కు పండిన పండు”
అని తిరగరాసేది!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

భారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి

Also Read:

ఓ టి టి సునామి

Also Read:

బూడిదే మిగిలింది!

RELATED ARTICLES

Most Popular

న్యూస్