Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకారు చీకట్లలో కాంతి రేఖలు

కారు చీకట్లలో కాంతి రేఖలు

పేపర్ తిరగేస్తే అక్షరమక్షరం కరోనా పాజిటివ్ లతో అన్నీ నెగటివ్ వార్తలే. టీ వీ ఆన్ చేస్తే వల్లకాటి వేడికి స్క్రీన్ మండిపోతోంది. అలాంటి వేళ…మొల లోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందంలా…కారు చీకట్లో కాంతి రేఖలా రెండు, మూడు వార్తలు కనిపించాయి.

హైదరాబాద్ లో ప్రయివేటు కంపెనీల్లో పనిచేసే భార్గవ్, ఉమా మహేశ్వరి, సాయిచంద్ బోయపాటి అభ్యుదయ భావాలున్న యువకులు. పెద్ద పెద్ద వివాహాలు, ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు పంచే ఒక గొప్ప కార్యక్రమానికి వీరు 2015 లో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో కోవిడ్ పేషంట్లకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. మొదట రోజుకు ఇరవై మందికి ఆహారమందించారు. ఇప్పుడు దాదాపు రోజుకు నూట ముప్పయ్ మందికి ఆహారం అందజేస్తున్నారు. వేల మంది రోగుల్లో నూట ముప్పయ్ సంఖ్య చిన్నదే కావచ్చు. కానీ- వీరి సంకల్పం మాత్రం చాలా పెద్దది. వీరి ప్రయత్నం గొప్పది. బాల్కనీల్లో చప్పట్లు, కంచాల మీద గరిటెల చప్పుళ్లతో పోలిస్తే వీరి అన్నదానం అన్ని దానాల్లోకంటే గొప్పదే. బయటికి వెళితే ఎక్కడ కరోనా అంటుకుంటుందో అని ఇళ్లల్లో మొక్కలకు నీళ్లు పోస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సెలెబ్రిటీల కంటే వీరు గొప్పవారే. ప్రపంచం కష్టాలు, కన్నీళ్లు అనంతం. ఎంత తీర్చినా తీరవు. కానీ- మనిషిగా పుట్టినందుకు, మానవత్వం ఉన్నందుకు ఎదుటి మనిషికి చేతనయిన సాయం చేస్తే చాలు. సాయం చేయాలని కదిలితే చాలు. ప్రపంచంలో సగం కష్టాలు మాయమవుతాయి. ప్రపంచం చల్లగా ఉంటుంది. చిన్న వార్తే అయినా ఆంధ్రజ్యోతి తగిన ప్రాధాన్యంతో ప్రచురించింది. పదిమందికి స్ఫూర్తి నింపే మంచి వార్త ఇది.
——————–

అదే ఆంధ్రజ్యోతి చివరి పేజీలో మరో వార్త. కన్నడ సినిమా హీరో అర్జున గౌడ కరోనా రోగులను ఆసుపత్రులకు తరలించే అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మాటలతో లాభం లేదని- పి పి ఈ కిట్ వేసుకుని, చేతులకు గ్లౌస్ తొడుక్కుని, మూతికి మాస్కు పెట్టుకుని అర్జున గౌడ కార్యరంగంలోకి దిగాడు. రెండు నెలలపాటు అంబులెన్స్ డ్రైవర్ గా కరోనా రోగులకు సేవ చేయాలన్నది తన సంకల్పం. మంచి వార్త.

అన్నట్లు- మన హీరోలు కూడా తక్కువేమీ కాదు. కరోనా ఈడ్చి కొడుతున్నవేళ ప్రాణాలకు తెగించి ముఖ్యమంత్రులను కలిసి థియేటర్లు తెరవడం, షూటింగులకు అనుమతుల్లాంటి ప్రాణావసర విషయాలను చర్చించి వచ్చారు. రోబో మిషన్ తో ఇళ్లు ఊడ్చారు. పెనం మీద అట్టు తిరగేశారు. ఎందుకో ఈ సాహసాలకు తగిన గుర్తింపు రాలేదు!
——————-

“మనిషైతే.. మనసుంటే
కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా..
కురిసి జగతి నిండాలిరా”

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్