ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. మదౌలి గ్రామంలోకి సోమవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. గ్రామంలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నివాసాలను, ఆలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. అయితే ఓ గుడిసెకు నిప్పు అంటుకోవడంతో.. అందులో ఉన్న తల్లీబిడ్డ సజీవ దహనం అయ్యారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనపై గ్రామ వాసి శివం దీక్షిత్ స్పందించారు. తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. పొద్దున్నే వచ్చి ఇండ్లను కూలగొట్టేశారు. గుడిసెకు నిప్పంటించారు. గుడిసెలో ఉన్న మా తల్లిని కాపాడుకోలేకపోయాను. గ్రామంలో ఉన్న ఆలయాన్ని కూల్చేశారు. రెవెన్యూ అధికారుల తీరు తీవ్ర మనస్తాపం కలిగించిందన్నారు.
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ప్రమీల దీక్షిత్, నేహా దీక్షిత్ గుడిసెలో ఉండి నిప్పంటించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. తాము గుడిసెకు నిప్పు పెట్టలేదని తెలిపారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.