ఒక  కథను స్వయంగా రాసుకుని .. ఆ సినిమాలో హీరోగా తానే నటిస్తూ దర్శకత్వం వహించడమనేది అంత తేలికైన విషయమేం కాదు. తీసుకున్న కథాంశం క్లిష్టమైనదైతే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రేక్షకులకు ఏం కావాలనేది హీరోగానూ ఆలోచించవలసి ఉంటుంది .. దర్శకుడిగాను ఆలోచన చేయవలసి వస్తుంది. అలా ఈ మూడూ తానై ఈ సినిమాను నడిపించినవాడే రిషబ్ శెట్టి .. ఆ సినిమానే ‘కాంతార’. కన్నడలో ఈ పదానికి అర్థం మిస్టీరియస్ ఫారెస్టు అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి చెప్పాడు.టైటిల్ కి తగినట్టుగా ఈ కథ అంతా కూడా ఫారెస్టు చుట్టూనే తిరుగుతుంది. తాము ఫారెస్టులో ఉన్న ఫీలింగ్ ను ఆడియన్స్ కి కలిగిస్తుంది.

ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో గ్రామనికి ఒక గ్రామదేవత ఉంటుంది. అన్ని రకాల ఆపదల నుంచి ఆ గ్రామదేవత తమని రక్షిస్తూ ఉంటుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతుంటారు. ఏడాదికి ఒకసారి ఆ గ్రామదేవతకి ఉత్సవాలు .. ఊరేగింపులు నిర్వహిస్తుంటారు. ఆ విషయంలో తాము పెట్టుకున్న నియమ నిబంధలను అతిక్రమించడానికి ప్రయత్నం చేయరు. అలాంటి ఒక ఆచారమే ఒక అడవి ప్రాంతంలో నడుస్తుంటుంది. ‘వారాహీ దేవి’ తమని కాపాడుతుంటూ ఉంటుందని ఆ గిరిజనులు బలంగా నమ్ముతుంటారు. ఆ అమ్మవారు ఒక రాజు కాలంలో ఆ వంశానికి ఇలవేల్పుగా మారుతుంది. అమ్మవారి అనుగ్రహానికి కారణమైన ఆ గిరిజనులకు ఆ రాజు అడవిలోని విస్తారమైన భూమిని దానంగా ఇస్తాడు.

కాలక్రమంలో ఆ రాజా కుటుంబీకులు అమ్మవారిని కొలవడం మానేస్తారు. అడవి పందులను వేటాడరాదనే నియమాన్ని ఉల్లంఘిస్తారు. అంతేకాదు గిరిజనులకు దానంగా ఇచ్చిన భూమిని బలవంతగా లాక్కోవాలని చూస్తారు. వాళ్ల ఆగడాల వలన ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే కథ. ఇది హీరోగా రిషబ్ శెట్టి విజృంభణ .. విశ్వరూపం అనే చెప్పాలి. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కథాకథనాలను ఆసక్తికరంగా నడపడంలోను విజయాన్ని సాధించాడు. మిగత ప్రధానమైన పాత్రలలో సప్తమి గౌడ .. కిశోర్ .. అచ్యుత్ కుమార్ మెప్పించారు. బలమైన కథాకథనాలు .. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. అరవింద్ కశ్యప్ కెమెరా పనితనం సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. ఆద్యంతం అడవిలో సాగే ఈ కథ సహజత్వానికి దగ్గరగా వెళుతూ ఆకట్టుకుంటుంది.

Also Read: కాంతార మరో సంచలనం సృష్టించనుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *