Friday, November 22, 2024
HomeTrending Newsకరీంనగర్ కాంగ్రెస్ లో అయోమయం

కరీంనగర్ కాంగ్రెస్ లో అయోమయం

క‌రీంన‌గ‌ర్ కాంగ్రెస్ లో పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. రేపటితో నామినేషన్ దాఖలుకు ఆఖరు. పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. దీంతో ఎవరికి వారు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వెలిచాల వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా నేతలు పాల్గొన్నారు.

తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా అల్గిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి ఈ రోజు (బుధ‌వారం) మ‌ధ్యాహ్నం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ప్ర‌వీణ్ రెడ్డి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అల్గిరెడ్డి అనుచ‌రులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇంకా ఖరారు చేయకున్నా కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా వెలిచాల రాజేందర్ రావు, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు రంగంలో ఉన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీ స్థానానికి పోటీ చేయ‌బోయే అస‌లైన అభ్య‌ర్థి ఎవ‌రనేది తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీ సీటు ఎవ‌రు దక్కించుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కరీంనగర్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి వ్యవహారం చివరకు రెండు కులాల మధ్య పోరుగా పరిణమిస్తోందని విశ్లేషణ జరుగుతోంది. కాంగ్రెస్ లో నామమాత్రంగా ఉన్న వెలమ వర్గానికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని రెడ్డి సంఘాలు గ్రామ స్థాయి సమావేశాల్లో తీర్మానం చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సౌమ్యుడు, ప్రజానేతగా పేరున్న అల్గిరెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వకపోతే సహకరించేది లేదని ఆయన అనుచరులు తెగేసి చెపుతున్నారు.

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. మంత్రి పొన్నం మద్దతు ఆయనకే ఉంది. ఏదైనా అద్భుతాలు జరిగితే మినహా వెలిచాలనే ఫైనల్.

దీనంతటికి కారణం కాంగ్రెస్ అధిష్టానం నాన్చుడు ధోరణి అని విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల వ్యవహారంతో బిజెపి అభ్యర్థికి అనుకూలంగా మారే అవకాశం ఉందని హస్తం నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్