Friday, November 22, 2024
HomeTrending Newsకరీంనగర్ కదనరంగం

కరీంనగర్ కదనరంగం

కరీంనగర్ లోక్ సభ స్థానం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపి, పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది అనేక తర్జన భర్జనల తర్వాత వెలిచాల రాజేందర్ రావుకు ఖరారు చేశారు.

దీని పరిధిలో కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా మిగతా నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నియోజకవర్గంలో మొత్తం 17 లక్షల మంది ఓటర్లు ఉండగా 78 శాతం గ్రామీణ ప్రాంతాల వారు, 22 శాతం పట్టణ ఓటర్లు ఉన్నారు. SC ఓటర్లు 19 శాతం.. మైనారిటీలు 7 శాతం ఉన్నారు.

1998, 99లో బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగరావు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించాక జరిగిన 2004 ఎంపి ఎన్నికల్లో కెసిఆర్ గెలిచి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు కరీంనగర్ తోడ్పడింది. 2006 లో తెలంగాణ ఉద్యమ తీవ్రత తెలిపేందుకు రాజీనామా చేసి కెసిఆర్ ఉపఎన్నికలకు వెళ్ళారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చతురంగ బలగాలు మొహరించినా గులాబీ జెండానే రెపరెపలాడింది. ఆనాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ ఎంపి స్థానం ప్రత్యేకత సంతరించుకుంది.

బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేరును అందరి కంటే ముందే ప్రకటించటంతో మూడు నెలలుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం కమ్ముకుంది. అప్పటి వరకు జై కొట్టిన  ద్వితీయ శ్రేణి నేతలు వరుసగా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేటిఆర్, కౌశిక్ రెడ్డిలు ప్రజల్లోకి వెళుతున్నారు. మిగతా ప్రాంతాల్లో పార్టీని సమన్వయము చేసే నేతలు మొక్కుబడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు వినోద్ కుమార్ చెప్పిందే వేదం అన్నట్టుగా జిల్లాలో సాగింది. అప్పటి అసంతృప్తిని పార్టీ క్యాడర్ ఇప్పుడు వెల్లగక్కుతోందని పార్టీలో టాక్ మొదలైంది.

బిజెపి నుంచి బరిలోకి దిగిన బండి సంజయ్ రెండోసారి గెలిచి రికార్డులు బద్దలు కొట్టాలని ఉవ్విల్లూరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గం అంత ఇప్పటికే రెండుసార్లు అన్ని మండలాలను చుట్టి వచ్చారు. హిందుత్వం, మోడీ చరిష్మాతో పట్టణ ప్రాంతాల ఓటర్లు ఆదరిస్తారనే ఆశ ఉంది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో బిజెపి క్యాడర్ బలంగా ఉండటం…అన్ని వయసుల వారికి పార్టీ, అభ్యర్థి సుపరిచితులు కావటం కలిసి వస్తుందని కమలం నేతల ధీమా.

ఎంపిగా తమ హయంలో నియోజకవర్గానికి పెద్ద ప్రాజెక్టును తీసుకురాలేడనే అసంతృప్తి ప్రజల్లో ఉన్నా… ఫైర్ బ్రాండ్ గా కరీంనగర్ పేరు నిలబెట్టారని చర్చ సాగుతోంది.

 

కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు చర్చోపచర్చలు చేసి చివరకు వెలిచాల రాజేందర్ రావుకు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెలిచల జగపతి రావు కుమారుడు రాజేందర్ రావు పార్టీలో చురుకుగా ఉన్నా.. ఎన్నికలకు తక్కువ సమయం ఉంది. గ్రూపు రాజకీయాల నేతలను సమన్వయము చేయటం కష్టతరంగా ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ ప్రవీణ్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. రాజకీయ వ్యుహకర్త సునీల్ కనుగోలు ఈ స్థానం బీసీలకు ఇవ్వాలని సూచిస్తే నాయకత్వం వెలమలకు ఏరి కోరి కట్టబెట్టింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ గెలుపు కోసం బలపం కట్టుకొని తిరుగుతున్నారు.

కరీంనగర్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. నామినేషన్ ఘట్టం మొదలైంది. అధికారికంగా ప్రకటించకపోయినా వెలిచాల మంత్రి పొన్నంతో కలిసి ఓటర్లను కలుస్తూ… పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సోమవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు.

విలక్షణ తీర్పుతో రాజకీయ పార్టీల అంచనాలను ఇక్కడి ఓటర్లు మారుస్తుంటారు. జనాల నాడి అందుకోవడం అంత సులువు కాదు ఇక్కడ. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపిలు వరుసగా తలోసారి గెలిచాయి. రెండోసారి గెలిచేందుకు అన్ని పార్టీలు ప్రచారం ఉదృతం చేశాయి.

బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వెలమ సామాజిక వర్గం కావటంతో రాజకీయ చైతన్యం కలిగిన బీసీలు బిజెపి వైపు మొగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైనారిటీ ఓట్ల విభజన కూడా బిజెపికి కలిసి వచ్చే అంశం. కెసిఆర్ తర్వాత ఆ స్థాయిలో కరీంనగర్ కు పీరు తీసుకొచ్చిన నేతగా బండికి పేరొచ్చింది. బండి సంజయ్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బండి స్పీడును అడ్డుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది.

బీఆర్ఎస్, బిజెపి అభ్యర్థులకు వ్యక్తిగత ఇమేజ్ కలిసివస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి కొత్త కావటంతో పూర్తిగా పార్టీ నేతలపైనే ఆధార పడాల్సి ఉంది. మూడు పార్టీలు అన్ని రకాలుగా బలంగా ఉన్నా బిజెపి, కాంగ్రెస్ ల మధ్య పోరు కేంద్రీకృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్