Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Siddhu controversial comments
‘ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి.. యన్యుల మనముల్‌ నొప్పించక తానొవ్వక.. తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ’
అన్న బద్దెన శతకంలోని ఈ పద్యరీతి సరిగ్గా సరిపోతుందని భావించాడో, ఏమో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ మాత్రం మరో వివాదంలో నానుతున్నాడు.

ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకుని… మాట్లాడుతూ ఇతరుల మనస్సులను బాధపెట్టకుండా.. తాను బాధపడకుండా లౌక్యంగా తప్పించుకొని తిరుగువాడే ధన్యుడు సుమా అన్న ఈ భావాన్ని ఒంటబట్టించుకున్నాననుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయి. సిద్ధూ తాజా వ్యాఖ్యలు… తన వివాదాస్పద వ్యాఖ్యల కోటాలో పీక్స్ కు చేరాయి. 

నిత్యం కొట్లాడుకుంటేనే దాయాదులై ఉండాలనేంలేదు. మనం శత్రువనుకున్న వారిపట్ల ప్రదర్శించే వ్యూహాత్మక మౌనమూ, చాలాసార్లు ఇగ్నోర్ చేయడమూ… సింబాలిక్ గా ద్వేషాన్ని ప్రదర్శించడమే! కానీ అలాంటి దాయాది దేశమైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ను ‘పెద్దన్న’ అని సంబోధించి మరోసారి వార్తల్లోకెక్కాడు వెటరన్ క్రికెటర్, కామెడీ టాక్ షోస్ పాపులర్ జడ్జి,  ప్రస్తుత రాజకీయ నాయకుడు, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.

కరోనా నేపథ్యంలో పాక్ భూభాగంలో ఏడాదిన్నర నుంచి మూసివేయబడ్డ కర్తార్ పూర్ కారిడార్ ను ఈమధ్యే 2021, నవంబర్ 17వ తేదీన తిరిగి ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. పంజాబ్ గురుదాస్ పూర్ డేరాబాబా నానక్, పాక్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ ను కలిపేదే ఈ కారిడార్.  ఈ క్రమంలో సిద్ధూ ఇక్కడికి సందర్శనకొచ్చాడు. తమ పార్టీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్నీ పర్యటించిన రెండు రోజుల తర్వాత అనే విషయాన్ని ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. పాక్ ప్రధాని.. తన సమకాలీన క్రికెటరైన ఇమ్రాన్ ఖాన్ ను ఉద్దేశించి ‘తనకు ఇమ్రాన్ పెద్దన్నయ్య’లాంటివాడన్నాడు సిద్ధూ! అంతేనా.. పంజాబ్ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే.. ఇరు దేశాల మధ్య సరిహద్దులను తెరవాలన్నారు. పంజాబ్ నుంచి పాక్ కు కేవలం 21 కిలోమీటర్ల దూరముంటే.. సరిహద్దు గొడవల వల్ల 21 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిరావడం దురదృష్టకరమన్నట్టుగా సిద్ధూ మాటలు సాగాయి. అయితే ఇదే అదనుగా బీజేపి, అనుబంధ హిందుత్వ శ్రేణులతో పాటు… సొంత పార్టీ ఎంపీ మనీష్ తివారీ వంటి నేతల నుంచీ  కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐఎస్, బోకోహరం వంటి సంస్థలను హిందుత్వంతో ముడిపెట్టే కాంగ్రెస్ నేతలే.. ఇప్పుడు దాయాది శత్రుదేశమైన పాక్ ప్రధానిని పెద్దన్నగా అభివర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా చెప్పకున్నట్టు తామందరివారమని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ నేతలు ఎప్పటికయ్యెది ప్రస్తుతమా మాటలాడుతారంటూ ఎద్దేవాకు దిగాయి పరివార్ సంస్థలు. అయితే ఇది సహజంగానే ఈరోజుల్లో జరిగే సోషల్ మీడియా యుద్ధానికీ దారితీసింది. సిద్ధూకు బాసటగా పంజాబ్ కు చెందిన మంత్రి పర్గత్ సింగ్ వంటివారు నిలుస్తూ.. మోడీ పాక్ వెళ్లితే మాత్రం దేశం కోసమన్నట్టు.. దేశం మీద ప్రేమ ఉన్నట్టు… సిద్ధూ పాక్ ప్రధానిని బడాభాయ్  అని సంబోధిస్తే మాత్రం తప్పా అన్నట్టుగా కౌంటర్స్ ఇవ్వడంతో ఈ వివాదం ఇప్పుడు ట్రెండింగ్ డిస్కషనైంది.

అయితే మరి సిద్ధూ వ్యాఖ్యలకు అంతగా స్పందించాలా అంటే…? రాజకీయమంటేనే.. తప్పకుండా స్పందించాల్సిందే! నిజానికి సిద్ధూ మాట్లాడినదాంట్లో తప్పేముందీ అన్నదీ ఇప్పుడు మరో ప్రశ్నే..? అవునూ సుదీర్ఘకాలం పాటు మూసివేయబడ్డ కర్తార్ పూర్ కారిడార్ తెరుచుకుని.. పంజాబ్ సిక్కులంతా తమ గురుదైవమైన గురునానక్ దేవ్ సన్నిధానాన్ని సందర్శించే క్రమంలో సిద్ధూ కూడా వెళ్లడం.. పాక్ ను పాలిస్తున్నవారిని సోదరభావంతో సంబోధించడంలో తప్పేముందోగానీ… తప్పులెంచువారు తమ తప్పులెరుగరన్నట్టుగా కనిపిస్తోంది.

అయితే సిద్ధూకూ ఇలాంటి వివాదాలు సర్వసాధారణమే! గతంలో ఇదే పాక్ కు వెళ్లినప్పుడు అక్కడి ఆర్మీ చీఫ్ బజ్వాను కౌగింలించుకుని ఇలాంటి వివాదానికే కారణమయ్యాడు. అంతేకాదు ఆయన ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ క్షేత్రంలో వివాదాలను రేపటం ఆయనకు క్రికెట్ బ్యాట్ తో స్పిన్నర్ల బౌలింగ్ లో సిక్స్ కొట్టినంత సహజం కూడాను! 1996లో ఇంగ్లాండ్ లో జరుగుతున్న క్రికెట్ టూర్ నుంచి నాటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తో గొడవ పడి సిద్ధూ వాకౌట్ చేసి తిరిగి ఇండియాకు వచ్చిన ఘటన..  ఇంకా నాటి రోజులు గుర్తున్నవారందరికీ మస్కిష్కంలో ఉండే ఉంటుంది. ఆ తర్వాత ఓ రెండేళ్లకేమో పంజాబ్ పటియాలా పట్టణంలో పార్కింగ్ విషయంలో ఓ 65 ఏళ్ల  వ్యక్తిపై సిద్ధూ చేసిన దాడి అనంతరం.. సదరు వ్యక్తి ఆసుపత్రిలో మరణించడమూ.. ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం.. సిద్ధూ నరహత్యకు పాల్పడ్డట్టు కింది కోర్టులు తేల్చడం..  చివరాఖరకు 2018లో  సుప్రీంకోర్టు కొద్ది పరిహారంతో వదిలేసిన వివాదమూ తెలిసిందే!

పంజాబ్  రాజకీయాల్లోనూ  ఇదే శైలి, సిఎం ఎవరైనా సరే, వారిని ఇరుకున పెట్టేలా ప్రవర్తించడం సిద్ధూ నైజం. అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ తోనూ.. ఆ రాష్ట్ర డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ తోనూ సిద్ధూకు వివాదాలేర్పడ్డాయి. వారిని పక్కనబెట్టేవరకూ తాను పీసీసి కార్యాలయానికి రాబోనని ఆయన శపథం పూనిన ఉదంతాలు ఈమధ్యే చూశాం. అయితే సిద్ధూ వివాదాలు ఇక్కడితో ఆగేవి కావు.. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ ను నిద్రపోనివ్వని సిద్ధూ వైఖరితో.. ప్రస్తుత సీఎం చరణ్ జిత్ కు కూడా కంటిమీద కునుకులేని పరిస్థితులెదురువుతున్నాయంటే.. సిద్ధూ వైఖరేంటో ఇంకా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు!

అయితే ఇలాంటి వివాదాలను బూచిగా చూపెట్టి….. సౌభాతృత్వానికి సూచికగా, వారి ఆరాధ్యదైవాన్ని కొల్చేందుకు వెళ్లిన క్రమంలో బడాభాయ్ అంటూ ఇమ్రాన్ ను మర్యాదపూర్వకంగా అభివర్ణించడాన్ని తప్పు పట్టడమంటే… మన మస్కిష్కాల్లోనే మలినమున్నట్టు! ఎక్కడో స్పష్టత కొరవడినట్టేమో?!! అలాంటిది దాయాది శత్రుదేశంలో ఉన్న గురునానక్ సన్నిధానాన్ని  తిరిగి తెరవడమెందుకూ అన్నదీ ఓ పేద్ద ప్రశ్నే!

-రమణ కొంటికర్ల

Also Read :

ఒక రద్దు – ఎన్నో వాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com