శ్రీలంక రచయిత కరుణతిలకకు బుకర్‌ ప్రైజ్‌

శ్రీలంక రచయిత షెహన్‌ కరుణతిలక 2022 సంవత్సరానికి బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. ద సెవన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలీ అల్మేదా అన్న నవలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. మానవత్వ లోతుల గురించి ఆ నవలో చాలా విపులంగా రాసినట్లు జడ్జిలు తెలిపారు. కరుణతిలక వయసు 47 ఏళ్లు. బూకర్‌ ప్రైజ్‌ గెలచిన రెండవ శ్రీలంక రచయిత ఆయన. 1992లో ఇంగ్లీస్‌ పేషెంట్‌ నవల రాసిన లంక రచయిత మైఖేల్‌ ఒండాజే ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.

ఓ ఫోటోగ్రాఫర్‌ కథే ద సెవన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలీ అల్మేదా. 1990 దశకంలో శ్రీలంకలో జరిగిన యుద్ధ నేరాల గురించి ఈ నవలలోని పాత్రలతో చెప్పించారు. జీవితం, మరణానికి సంబంధించిన సత్యాలను చాలా సాహసోపేతంగా రచయిత తన నవలలో రాసినట్లు జడ్జిలు తెలిపారు. యుద్ధ నేరాలకు చెందిన ఫోటోలతో ఆ దేశాన్ని మెల్కోల్పిన తీరు ఆ కథలో ఉన్నట్లు బుకర్‌ కమిటీ అభిప్రాయపడింది. శ్రీలంకలో సాగిన అకృత్యాలను సెటైర్‌ రూపంలోనూ ఆ నవలలో చిత్రీకరించారు.

కరుణతిలక 1975లో గాలేలో జన్మించారు. కొలంబోలో పెరిగారాయన. నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితిపై జోకులు వెయ్యడం శ్రీలంకన్ల ప్రత్యేకమని కరుణతిలక అన్నారు. మరణం తర్వాత జరిగిన సంఘటనలతో ఫోటోగ్రాఫర్‌ మాలీ అల్మేదా ఎలా యుద్ధ నేరాలను బయటపెడుతారన్న విషయాన్ని రచయిత చాలా థ్రిల్లింగ్‌ చెప్పినట్లు బుకర్‌ కమిటీ జడ్జిలు తెలిపారు. 2011లో ఆయన రాసిన తొలి నవల చైనామ్యాన్‌కు కామన్‌వెల్త్‌ ప్రైజ్‌ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *