TRS 2.O: కెసిఆర్ హీరోగా పాన్ ఇండియా సినిమా ముహూర్తం ఫిక్స్ అయిందా.. అవునంటున్నాయి ప్రగతిభవన్ వర్గాలు. ఉప్పందుతున్న సమాచారం ప్రకారం కెసిఆర్ పాన్ ఇండియా సినిమా ప్రకటన అతి త్వరలోనే ఉండనుంది. అదే కెసిఆర్ కొత్తగా పెట్టబోయే జాతీయ పార్టీ . బిజెపి ముక్త్ భారత్ నినాదంతో నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యేందుకు మనసా వాచా సిద్ధమైన గులాబీ దళపతి ఇటీవల కాలంలో జరిపిన ప్రతి సభలోనూ జాతీయ రాజకీయాల ప్రస్తావన తెచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళదామని తడాఖా చూపిద్దామని అంటూ ప్రజల చేత జై కొట్టించుకొచ్చారు.
కమలంతో కయ్యం తరువాత తప్పనిసరి పరిస్థితో, తప్పుడు అడుగో కాని కెసిఆర్ మాత్రం జాతీయ రాజకీయాలనే వల్లెవేస్తున్నారు. అందుకు తగిన కంటెంట్ ను రెడీ చేసుకుంటున్నారు. బహిరంగ సభలలో ప్రజల చేత అవుననిపించుకొని అదే అవుననిపించి, నిజామాబాద్ సభలో ఏకంగా జాతీయ పార్టీ పెడితే తాము దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ను అందజేస్తామంటూ పెద్ద హామీనే గుప్పించారు. టిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారబోతుందన్న తన మనసులో మాటను ఓపెన్ అయ్యారు.
అటు తరువాత మొన్నటికి మొన్న పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నేషనల్ పాలిటిక్స్ లో ఎంట్రీ అవశ్యాన్ని నొక్కి వక్కాణించిన గులాబీ బాస్ పార్టీ నేతలతోనూ జై కొట్టించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీ టిఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద బండి నడకని ధైర్యం చెప్పి మరీ పార్టీ ఎమ్మెల్యేలలో జోష్ నింపి ,ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని మరీ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.
గులాబీ బాస్ ఏమి చెప్పారో ,ఏమి సంకేతాలు ఇచ్చారో గాని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అందరూ అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి తమనేత కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని, బీజేపీ కి ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీ పెట్టాలని బలంగా కోరారు. కేంద్రంలో బిజెపి వైఫల్యాలను ఎండగట్టి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడపగల సత్తా తమ నేత కేసీఆర్ ఒక్కడికే వుందన్నారు. తెలంగాణను సాధించడమే కాకుండా గడచిన 8 సంవత్సరాలలో తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అంటూ దేశం యావత్తుకు ప్రస్తుతం ఆయన అవసరం ఎంతైనా ఉందని తేల్చిచెప్పారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తం కావాలని చెప్పుకొచ్చారు. మీ వెంట మేమున్నాం అంటూ అభయం ఇచ్చారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి వంటి మరికొందరు కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటం చారిత్రక అవసరంగా పేర్కొన్నారు. ఏదైతేనేం త్వరలో టిఆర్ఎస్ , భారతీయ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మారుతుందనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతోకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. బిజెపి కాంగ్రెసేతర జాతీయ ప్రత్యామ్నాయంపై చర్చలు కూడా జరిపారు. కొన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడే నాయకులను కలిశారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్, ఎన్ సీ పీ కురువృద్ధుడు శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, డీఎంకే అధినేత స్టాలిన్ ఇలా విపక్షనేతలందరినీ కలిసి మరీ బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కలిసి నడుద్దామని ఆహ్వానించారు.అప్పట్లో అందరూ సరేనని తలలు ఊపినా ఆ చర్చలకు ఆశించిన ఫలితం రాలేదన్నది బహిరంగ రహస్యమే.
అంతే ఆ తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ తన లాబీయింగ్ రూటు మార్చారు. రైతు పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం పేరుతో పంజాబ్ పర్యటన చేపట్టిన కేసీఆర్ ,ఆప్ అధినేత కేజ్రీవాల్ తో చర్చలు జరిపారు. తాజాగా బీహారులో అమరులైన జవాన్లకు, హైదరాబాద్ లో ప్రమాదానికి గురై మరణించిన బీహారీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం పేరిట పాట్నా పర్యటన చేపట్టి జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో మంతనాలు సాగించారు. పనిలోపనిగా ఆర్జేడీ నేతలతోనూ చర్చలు జరిపారు. ఈసారి మాత్రం కేవలం బీజేపీ పైనే పోరాటం ప్రధాన ఎజెండాగా మారింది.మరో అడుగు ముందుకేసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులను హైదరాబాదుకు పిలిపించి చర్చలు జరిపారు. ఆతిథ్యం ఇచ్చి తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలను వివరించారు.
బీజేపీ పై పోరాటం లో విపక్షాలన్నీ ఐక్యంగా తమతో కలిసి వస్తాయోలేదో అనుకున్నారేమో గానీ కేసీఆర్ మాత్రం కొత్తగా జాతీయ పార్టీ పెట్టాలని మాత్రం డిసైడ్ అయిపోయారు. తెలుగు సినిమా దర్శకులు తమ కంటెట్ నే పాన్ ఇండియా సబ్జెక్టు గా తెరకెక్కిస్తున్న రీతిలో టీఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ కూడా తెలంగాణ అభివృద్ధి, ఇక్కడ తాము అమలు చేస్తున్న పథకాలనే , తెలంగాణ మోడల్ పేరిట జాతీయ పార్టీ కి సిద్ధమయ్యారు.అంతే టిఆర్ఎస్ నేతల మాటలు చూస్తుంటే కేసిఆర్ పాన్ ఇండియా సినిమా ప్రకటనకు అతి త్వరలోనే ముహూర్తం ఉన్నట్లు అనిపిస్తోంది. ఈనెల 11న జేడిఎస్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్ రానుండటం, కేసీఆర్ తో రాజకీయ చర్చలు జరగనున్న దరిమిలా ఆరోజు కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఆవిర్భవించటం అంటే మాటలు కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించడానికి కేసీఆర్ ఏమి చేస్తారు! ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు! ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ పెట్టి పార్లమెంట్ ఎన్నికల నాటికి అన్ని రాష్ట్రాలలో అభ్యర్థులను ఎలా నిలబెట్టడతారు! ఇలా అన్నీ ఉహకందని ప్రశ్నలే. వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కూడా అంత సులువైన అంశం కాదు. అంతెందుకు పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో టిఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలన్నా కష్టసాధ్యమే. మరి ఇన్ని ఆటంకాలు,అవరోధాల మధ్య కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా బలంగా వున్న బీజేపీ ని ఎదుర్కోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముందు ఇంటగెల్చి రచ్చ గెలవాలన్న రీతిలో లోక్ సభ ఎన్నికలకు ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం కేసీఆర్ పై ఎంతైనా వుంది. దేశవ్యాప్తంగా అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ గత వైభవాన్ని కోల్పోయి, ఉనికి కోసం పోరాడుతున్న వేళ జాతీయస్థాయిలో ఇంకొక ప్రత్యామ్నాయం కావాలనుకున్నారో, అది తామే అనుకున్నారో ఏమో కానీ... జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ అడుగులు ఆ పార్టీకి, దేశానికి ఎంత వరకూ ప్రయోజనం కలిగిస్తాయో కాలమే నిర్ణయిస్తుంది.
– వెలది. కృష్ణ కుమార్
Also Read :
Also Read :