Friday, January 24, 2025
Homeజాతీయంలక్ష్యద్వీప్ ఆందోళనలకు కేరళ మద్దతు

లక్ష్యద్వీప్ ఆందోళనలకు కేరళ మద్దతు

లక్ష్యద్వీప్ గవర్నర్ ను వెనక్కి పిలిపించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ అంశానికి ప్రతిపక్షం కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపింది. లక్ష్యద్వీప్ ప్రజలకు కేరళ ప్రభుత్వం అండగా ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నారు.

గవర్నర్ ప్రఫుల్ పటేల్ వివాదాస్పాద నిర్ణయాలతో దీవుల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రికాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. స్థానికుల మనోభావాలు దెబ్బ తినేలా గవర్నర్ తీసుకొచ్చిన సంస్కరణల్ని వెంటనే రద్దు చేయాలని సి.ఎం. విజయన్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు గవర్నర్ నిర్ణయాలపై లక్ష్యద్వీప్ లో నిరసనలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ సరిగా రాకుండా ఉన్నతాధికారులు నిరంతరం ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజధాని కవరత్తి తో సహా మినికాయ్, అగట్టి  దీవుల్లో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర బిజెపి నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేసి ఆందోళన బాట పట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో పరిస్టితులపై పార్టీ పెద్దలకు నివేదిక సమర్పించారు.

ప్రశాంతంగా ఉండే లక్ష్యద్వీప్ లో గుండా యాక్ట్ తీసుకురావటం పై విమర్శలు వస్తున్నాయి. పర్యాటకం పేరుతో కొన్ని దీవుల్లో ఎక్కువ భాగం కార్పొరేట్ శక్తులకు అంటగట్టడం, రోడ్ల వెడల్పు పేరుతో సామాన్యులకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని బిజెపి నేతలే అసంతృప్తిగా ఉన్నారు. మధ్యాహన్న భోజన పథకంలో మాంసాహారాన్ని తొలగించటం వివాదంగా మారింది. గవర్నర్ ప్రఫుల్ పటేల్ పాలనలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్