ఖలిస్థాని ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు… అంతర్జాతీయంగా వేర్పాటువాదులు, ఉగ్ర సంస్థలు ఏదో ఒక సంచలన ప్రకటన చేయటం ఇటీవల సాధారణంగా మారింది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను చంపేస్తామని హెచ్చరించాడు. జనవరి 26వ తేదీన భగవంత్ మాన్‌ను చంపేస్తామని… గ్యాంగ్‌స్టర్‌లు అంతా ఏకమై గణతంత్ర దినోత్సవం రోజు పంజాబ్ సీఎంను చంపేందుకు కలిసి రావాలని పిలుపు ఇచ్చాడు.
ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే బెదిరింపులకు కారణంగా తెలుస్తోంది. బెదిరింపులపై స్పందించిన పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్… గ్యాంగ్‌స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తోందని తెలిపారు. పన్నూన్ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పన్నూన్ బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటి సారి కాదు. గత కొన్ని రోజులుగా భారత్‌కు చెందిన పలువురు నేతలను చంపేస్తామంటూ, ప్రముఖ ఆలయాలు, ఎయిర్‌పోర్ట్‌లను ధ్వంసం చేస్తామంటూ బెదిరింపులు చేశాడు. గత నెలలో కూడా పార్లమెంట్ భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఇప్పుడు తాజాగా పంజాబ్ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
దేశ విభజన సమయంలో పంజాబ్ రాష్ట్రాన్ని చీల్చి ఒకటి భారత్.. మరొకటి పాకిస్తాన్ కు దక్కేలా ఆంగ్లేయులు చేశారు. దీంతో ఆ రోజు నుంచి సిక్కుల్లో రగులుతున్నఅసంతృప్తి స్వతంత్ర దేశ భావన వైపు మళ్ళింది. పాకిస్తాన్ లోని పంజాబ్ ను స్వతంత్ర దేశం చేస్తామని సిక్కు వేర్పావాదులు ప్రకటించిన సందర్భాలు అరుదు. ఆ నినాదం ఇస్తే పాక్ కఠిన చర్యలకు ఉపక్రమిస్తుంది. సిక్కుమత స్థాపకుడు గురునానక్ జన్మస్థలంతో సహా వివిధ సిక్కు పవిత్ర స్థలాలు పాక్ లో అధికంగా ఉన్నాయి. వాటిని సందర్శించటం కుదరదు. అందుకే ముందు భారత్ లోని పంజాబ్ ను స్వతంత్ర దేశం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనికి తోడు భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థలకు, వేర్పాటువాదులకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయని వివిధ సందర్భాల్లో వెలుగు చూసింది. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా దేశాల్లో భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న వారిలో పాక్ సిక్కులే ముందు వరుసలో ఉంటారు. భారత పౌరుల్లో రెండు, మూడు తరాల తర్వాతి వారు వీరితో గళం కలుపుతున్నారు.
భారత్ లోని సిక్కుల్లో కొందరు నేరచరితులు ఉగ్రసంస్థలతో అంటకాగుతున్నారు. వారి ద్వారా దేశంలో అలజడి సృష్టించేందుకు వేర్పాటువాదులు కుట్ర చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా, నేర చరితులను కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో పంజాబ్ లో హింస మరింత పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉంది.
-దేశవేని భాస్కర్