Tuesday, November 5, 2024

ఖర్గే ఉవాచ!

దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఎముకలు కొరికే ఢిల్లీ చలిలో ఎఐసిసి ఆఫీస్ కు వచ్చినవారికి ఒక కప్పు వేడి చాయ్ ఇచ్చేందుకు కూడా దాని దగ్గర డబ్బులుండవు.

ఆసేతు హిమాచలం రాష్ట్రాల్లో కాంగ్రెస్ తనతో తానే విభేదిస్తూ, తనతో తానే గొడవ పడుతూ, తన తల తనే గోడకేసి కొట్టుకుంటూ బిజీగా ఉంటుంది.

A large formal meeting is called Congress– అన్నది నిఘంటువు అర్థం. ఆ కోణంలో ప్రస్తుత కాంగ్రెస్ ది సార్థక నామధేయమే. అది ఎంత లార్జో దానికే తెలియదు. అధికారంలో ఉంటే అది అధికార కాంగ్రెస్. అధికారంలో లేకుంటే అది అనధికార కాంగ్రెస్. అధికారంలో ఉన్నా- లేకున్నా అది ధిక్కార కాంగ్రెస్.

అలాంటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా కత్తి నూరి పదునైన ఆయుధాన్ని మహారాష్ట్ర ఎన్నికల ముంగిట్లో ప్రత్యర్థులకు ఇస్తే ఇచ్చారు కానీ…ఆయన చెప్పిన విషయం మీద దేశమంతా చాలా సీరియస్ చర్చ జరగాలి. “కర్ణాటకలో ఎన్నికలకు ముందు అలవిమాలిన హామీలిచ్చారు. జనం నమ్మి ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలు కూడా కాకుండానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో కష్టమని చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం; ఖర్చులు; కొత్త హామీల అమలులో సాధ్యాసాధ్యాలను లెక్కలోకి తీసుకుని చేయగలిగినవే చెప్పాలి” అని ఖర్గే పార్టీ వేదికమీద బహిరంగంగానే చెప్పారు.

వెంటనే బీ జె పి లో ప్రధాని మోడీ మొదలు వీధి నాయకుడిదాకా అందరూ “ఖర్గే మాటలతో కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది. కాబట్టి కాంగ్రెస్ ను ఎవరూ నమ్మకండి. ఆ పార్టీ ఇచ్చిన హామీలను ఆ పార్టీ అధ్యక్షుడే నమ్మడం లేదు” అని మహారాష్ట్ర ఎన్నికల్లో అందివచ్చిన కొత్త ప్రచారాయుధాన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు.

రాజకీయాలు దాటి ఒక బాధ్యతగల ప్రజాస్వామ్య దేశంగా ఎన్నికల హామీలు- సాధ్యాసాధ్యాల మీద ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్టు కలుగజేసుకోవాలి. ఉచితానుచితాలమీద పార్టీలు లెక్కలు చెప్పాలి. ఏ హామీని ఎలా ఎంతకాలం అమలు చేస్తారో చెప్పాలి. మ్యానిఫెస్టోలో చెప్పినవి అధికారంలోకి వచ్చాక చేయకపోతే ఆ పార్టీమీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేలా చట్టం తేవాలి.  పన్నులు కట్టేవారి సొమ్ము ఎటు వెళుతోందో తెలుసుకునే హక్కు కల్పించాలి. అలవిమాలిన హామీలిచ్చే చిత్తు కాగితాల మ్యానిఫెస్టో సంప్రదాయానికి స్వస్తి పలకాలి.

ఇవన్నీ జరిగేవి కావన్న నిస్పృహతోనే చాలామంది-

“…ఉన్నది మనకు ఓటు-
బతుకుదెరువుకే లోటు…
గాంధి పుట్టిన దేశమా ఇది?
నెహ్రు కోరిన సంఘమా ఇది?
సామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా ఇది?”  అని నైరాశ్యగీతాలు పాడుకుంటూ ఉంటారు.

“Democracy is an anarchy; but there is no better alternative for democracy- ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు”
కాబట్టి ఖర్గే అన్న మాటలు ప్రజాస్వామ్య చట్రంలోనే కనీసం చర్చగా అయినా మొదలైతే…ఏదో ఒకనాటికి చట్టంగా అయి పార్టీలు బాధ్యతవహించాల్సిన మంచిరోజు వస్తుందేమో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్