Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్నవంబర్ 13న క్రీడా అవార్డుల ప్రదానం

నవంబర్ 13న క్రీడా అవార్డుల ప్రదానం

Khel Ratna Awards Will Be Presented On November 13th :

క్రీడా రంగంలో విశేష ప్రతిభ చూపే ఆటగాళ్ళు, కోచ్ లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల ప్రదానం నవంబర్ 13న జరగనుంది. రిటైర్డ్ జస్టిస్ ముకుందం శర్మ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిపార్సు చేసిన ప్రతిపాదనలను ఒకే ఒక మార్పుతో యధాతథంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. హాకీ ప్లేయర్ మన్ ప్రీత్ పేరును కమిటీ అర్జున అవార్డుకు ప్రతిపాదించగా క్రీడా శాఖ అతనికి కూడా ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో మొత్తం 12 మందికి అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, 25 మందికి అర్జున అవార్డులు ప్రదానం చేయనున్నారు.  నిన్న ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించారు.

ఇటీవలే టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో  జావెలిన్ త్రో విభాగంలో భారత దేశానికి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు ఖేల్ రత్న అవార్డు లభించింది. ఆయనతో పాటు భారత మహిళా క్రికెట్ టెస్ట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, రెజ్లర్ రవి కుమార్ దాహియా, బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా, హాకీ ఆటగాడు శ్రీజేష్, ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ చెత్రీ, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ లో పతకాలు అందించిన  షూటర్ అవని లేఖరా, సుమిత్ ఆంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నగార్, మనీష్ నర్వాల్ లను ఖేల్ రత్న వరించింది.

క్రికెటర్ శిఖర్ ధావన్ కు అర్జున అవార్డు ప్రకటించారు. హాకీ క్రీడాకారులు…. రూపేందర్ సింగ్, సురేందర్, అమిత్, బీరేంద్ర, సుమిత్, నీలకంత శర్మ, హార్ధిక్ శర్మ, వివేక్ సాగర్, గుర్జాంత్, మన్ దీప్, షంషేర్, లలిత్ కుమార్, వరుణ్ కుమార్, సిమ్రాన్ జీత్ సింగ్ లకు అర్జున పురస్కారం దక్కింది.  పారా అథ్లెట్లు యోగేష్, ప్రవీణ్ కుమార్, భావీనా పటేల్, హర్వీందర్ సింగ్, శరద్ కుమార్, సుహార్, సింగ్ రాజ్ అథానా లకు కూడా అర్జున దక్కింది.

నవంబర్ 13న రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరగనుంది.

Must Read :ఒలింపిక్స్ క్రీడాకారులకు గవర్నర్ సన్మానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్