ఒక డాక్టరు పేరు చెబితే ఇంత మంది అంత అభిమానంగా చూస్తారా?
ఓ డాక్టరు గురించి మాట్లాడితే ఇన్ని కళ్ళు అంత ఆప్యాయంగా మెరుస్తాయా?
ఓ డాక్టరు ముఖం చూస్తే ఇన్ని పెదవులు అంత హాయిగా నవ్వుతాయా?
అదీ…మనుషుల ఆరోగ్యం సేవా రంగం నుండి వ్యాపార రంగంగా మారిపోయిన ఈ రోజుల్లో!
కానీ…ఎక్కడో ఎవరో ఇంకా అలా కొందరు ఉన్నారు.
బహుశా అందుకే భూమిపై ఇంకా వానలు కురుస్తున్నాయేమో.
అందుకే కొంచెం అటూ ఇటూ అయినా రుతువులు తమ గమనాన్ని పూర్తిగా మరచిపోలేదేమో.
అందుకే మనిషికి సాటి మనుషులపై మమకారం పూర్తిగా ఆవిరైపోలేదేమో.
ఇది అటువంటి ఓ అరుదైన వైద్యుడి కథ.
మనందరి మధ్య ఉన్న ఓ మంచి మనిషి కథ.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
అప్పుడెప్పుడో ఎనభైల మధ్యలో బొబ్బిలి గురుకుల పాఠశాలలో చదువుతోపాటు మనిషి గురించి మమత గురించి చెప్పిన ఆ గురువుల ప్రజ్ఞా పాటవమో, లేక తల్లిదండ్రులనుండి అబ్బిన సంస్కారమో, లేక చుట్టూ ఉన్న పరిస్థితులకు స్పందించే మానవ సహజగుణమో.. తనకు ఆ వృత్తిలో ఓ విభిన్నమైన జీవన మార్గానికి పునాది వేసి ఉంటాయి.
కారణమేదైతేనేం…
కరుణ వీడని ఆ పయనం, చిరునవ్వు చెదరని ఆ హృదయం, కల్తీలేని వైద్యంపై ఇంకా నమ్మకాన్ని కలిగిస్తోంది.
వైద్యులపై ఇంకా ప్రేమను కురిపిస్తోంది.
మనస్పూర్తిగా రెండు చేతులతో దండం పెట్టిస్తోంది.
ఆ జిల్లా మారుమూలల నుండీ రోగులను తన దగ్గరకి రప్పిస్తోంది.
ఆ వైద్యుడి పేరు పి.వి. కృష్ణంరాజు.
తను ఉండే ఊరు విజయనగరం.
చర్మ సంబంధిత కష్టాలు ఏమొచ్చినా ఎవర్ని అడిగినా చెప్పే తొలి పేరు అతడిదే.
వైద్యమంటే ఫీజు తీసుకుని మందులు రాసి పంపే వ్యవహారాన్నే చూసిన ఎవరికైనా…రోగులతో ఇతడు మాట్లాడే విధానం , ఆ రోగం గురించి వారికి అర్థమయ్యేటట్లు చెప్పే గుణం ఆశ్చర్యం కలిగిస్తుంది.
తెలుగు వచ్చినా ఇంగ్లీషులో మాట్లాడే భేషజాల జీవులకు భిన్నంగా గ్రామాల నుండి వచ్చిన చదువురాని వారికి వారిదైన భాషలో చెప్తూ…అయిదు నిముషాల్లో వారికి ఆత్మీయుడిగా మారిపోవడం వైద్యంతో పాటు ఇతడికి తెలిసిన మానవ సంబంధాల పరుసవేది విద్య.
రోగుల్ని చూసి వారి ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి సగం మందులు అక్కడే ఉచితంగా ఇచ్చే ఇతడి మానవత్వం….
ఆ రంగంలో అంత ప్రముఖుడైనా బాగా పేదవాడికి కూడా కష్టం కలగనంత తక్కువ ఫీజు తీసుకునే ఇతడి మంచితనం…
ఇంకా ఇటువంటి వారున్నారా! అని అనిపించేటట్లు చేస్తాయి.
తను నడిచిన తొలి అడుగులు మరవక , తను చదువుకున్న స్కూలు విద్యార్థులలో పోటీ తత్వాన్ని నింపడానికి ప్రతి యేడూ తొలి స్థానాన్ని పొందిన వారికి తను ఇచ్చే మొత్తం ఆ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ సంవత్సరం పొలంలో పండిన పంటైతే…
ఇతడి దాతృత్యం – సింహాలు లేని ఆ సింహాల తోట పేరుగల ఆ ఆశ్రమ పాఠశాల కన్నుల పంట.
ఇక,
నలభై సంవత్సరాల ముందు నుండి నిరుటి వరకూ అక్కడ చదువుకున్న మా అందరికీ ఇతడో ఆదరణీయమైన అన్న. ఏభై అయిదేళ్ల వయసులో కూడా వందల మందున్న వాట్సాపు గ్రూపులో ఏ సరదా సంభాషణలోనో ఇప్పటికీ అందగాడు ఈ అన్నే అంటే ఆహ్లాదంగా నవ్విన ఆ చిరునవ్వు అప్పట్లో తన సర్కిళ్ళలో ఎన్ని కన్నె గుండెల్ని కొల్లగొట్టిందో! ఎంత మంది నిరాశా నిస్పృహల్ని కొన్ని క్షణాల పాటైనా తుళ్ళగొట్టిందో!
అది నిజమే అనడానికి విశాఖపట్నంలో ఆ మధ్య కలిసిన ఓ వైద్యురాలు…కృష్ణంరాజు సార్ ఎంత మంచి వారో…ఎంత బాగుంటారో…అన్న సరదా మాటలే తార్కాణం.
ఓ సారి విజయనగర మాజీ సంస్థానాదీశులు అయిన ఆనంద గజపతిరాజు ఏదో వైద్యం కోసం ఇంటికి రమ్మని ఫీజు ఇవ్వబోతే…
“అప్పట్లో మా స్కూలు శంకుస్థాపన చేసిన విద్యాశాఖా మంత్రి మీరు… అక్కడ చదువుకున్న మేము మీకే ఎంతో రుణపడి ఉంటాం” అన్న ఇతడి సంస్కారం ఆ రాజు కళ్ళలో ఇతడిని ఓ మహరాజుని చేసుంటుంది.
సమాజంలో ఇటువంటి వారు మరి కొంచెం ఎక్కువ మంది ఉంటే ఎంత బాగుణ్ణో అని కచ్చితంగా అనిపించే ఉంటుంది.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
అందుకే…
ఇన్ని సులక్షణాలున్న ఈ వైద్యుడి జన్మ ధన్యం.
సమస్య నుండి బయటపడి…అంతా నీ చేతి సలవ నాయనా అని ప్రేమగా పలికిన వారి మేని మెరుపులు, కనుల వెలుగులు ఈ మనిషి చేసుకుంటున్న పుణ్యం.
-కిలపర్తి త్రినాథ్
9440886844