Who is ‘Supreme’:
“సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా!
న్యాయాన్యాయము తెలుసును;
జగములు మాయామయమని తెలుసును”
నాద బ్రహ్మ త్యాగయ్య గొప్ప కీర్తనతో మొదలు పెట్టినా…ఇది నాదోపాసనకు సంబంధించిన సంగీత, మంత్రాక్షరాలకు సంబంధించిన సాహిత్య చర్చ కాదు. దాదాపు 250 సంవత్సరాల కిందటే న్యాయ- అన్యాయ కలిపి న్యాయాన్యాయాల గురించి ఆయన ప్రస్తావించిన విషయం గురించి.
సర్వసంగ పరిత్యాగి, భిక్షాటనతో జీవితాన్ని నాదోపాసనలో పండించుకున్న మహానుభావుడే…ఏది న్యాయమో? ఏది అన్యాయమో? బాగా తెలుసు అన్నాడు. ఇక లౌకిక విషయాల్లో నిత్యం మునిగితేలే మనం న్యాయ- అన్యాయాల గురించి ఎంతగా తెలుసుకోవాలి? ఈ కోణంలో న్యాయంగా మనకు తెలియాల్సినంత న్యాయం తెలిసిందా? లేదా?
నయమయినది న్యాయం. అంటే మేలయినది. నయం అనే మాటలో నుండే న్యాయం అనే మాట పుడుతుంది. న్యాయం అని మనమనుకుంటున్నదంతా నయమయినదేనా? కాదా? అనేది వేరే చర్చ. అది ఇక్కడ అనవసరం.
భారత న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజు ఆర్ ఎస్ ఎస్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అన్న మాటల మీద దేశంలో చాలా చర్చ జరగాలి. అలా జరగాలని ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ మాటలు అన్నట్లు పాలు తాగే పసి పిల్లలకు కూడా తెలుసు. లేకపోతే సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామక విధానం గురించి అంతేసి మాటలను అంత అలవోకగా అని ఉండేవారు కాదు. ఇంత తీవ్రమయిన, సున్నితమయిన విషయాలను ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా అంగీకారం, అనుమతి లేనిదే ఆయన అని ఉండరు. ఒకవేళ ఆయనకు ఆయనే అని ఉన్నా…ఇంతదాకా వారు ఖండించలేదు కాబట్టి ఆయనన్న మాటలను వారు కూడా అంగీకరించినట్లే అనుకోవాలి. ఆయన మాటల్లో ప్రధానాంశాలు ఇవి:-
1. ప్రపంచంలో ఎక్కడన్నా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే విధానం ఉందా?
2. న్యాయమూర్తులకు న్యాయం మీద కంటే తమ నియామకాల మీదే దృష్టి పెరిగింది.
3. న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలున్నాయి.
4. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూసినా…న్యాయమూర్తుల నియామకం బాధ్యత కేంద్రానిదే తప్ప కొలిజియానిది కాదు.
5. 1993 వరకు కేంద్రమే న్యాయమూర్తులను నియమించేది.
మిగతా విషయాల్లాగా దీనిమీద ఎలా పడితే అలా మాట్లాడితే కోర్టు ధిక్కార నేరం కింద లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటామని చాలా మంది మౌనంగా ఉన్నారు.
మోడీ- అమిత్ షాల ఆలోచనలకు అనుగుణంగా కిరణ్ రిజు ఒక ఫీలర్ బయటికి వదిలారు అన్నది స్పష్టం. నాణేనికి రెండు వైపులు ఉన్నట్లు…కిరణ్ రిజు చెబుతున్నట్లు న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటే పక్షపాతానికి ఆస్కారముంటుంది అని అనుకుంటే…న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తే పక్షపాతానికి అణువంత కూడా ఆస్కారముండదా? అన్నదే మెడకాయ మీద తలకాయ ఉన్నవారు ఆలోచించాల్సిన విషయం.
ఏది న్యాయం?
ఏది అన్యాయం?
…అందుకే “న్యాయాన్యాయము” తెలిస్తే ఈ జగత్తు, దాని పోకడ…అంతా “మాయమయం” అని స్పష్టంగా తెలుస్తుందని త్యాగయ్య అయోమయం లేకుండా చెప్పాడు.
ఊరికే ధన్యాసి రాగానికి ఆది తాళంలో తొడగొట్టుకుని “న్యాయాన్యాయం” అని పరవశించి పాడితే సంగీతం ధన్యమయితే కావచ్చు…ఆ న్యాయ- అన్యాయాలను పాలు నీళ్లలా వేరు చేసుకుని చూడకపోతే త్యాగయ్యను మనమేమి అర్థం చేసుకున్నట్లు?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :