ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవి నుంచి కిరణ్ రిజిజును తొలగించారు. ఆయన స్థానంలో ఆ శాఖకు అర్జున్ రామ్ మేఘవాల్‌ను నియమించారు. పార్లమెంట్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును న్యాయశాఖ నుంచి తొలగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేంద్ర మంత్రుల్లో రిజిజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన్ను ట్రబుల్‌షూటర్‌గా భావిస్తారు. న్యాయశాఖను కోల్పోయిన రిజిజుకు ఇప్పుడు భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ( ఎర్త్ సైన్సెస్ శాఖ)ను కేటాయించారు. రాష్ట్రపతి కార్యాలయం ఇవాళ ఉదయం ఈ మార్పుపై ప్రకటన జారీ చేసింది. ప్రధాని మోదీ సలహా మేరకు ఈ మార్పు చేసినట్లు సూచించింది. మంత్రి కిరణ్ రిజిజు కూడా తన ట్విట్టర్ ప్రొఫైల్‌ను మార్చేసుకున్నారు.
ఇప్పటి వరకు భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నిర్వహించారు. ఈ శాఖను కిరణ్ రిజిజుకు అప్పగించారు. కిరణ్ రిజిజు న్యాయ మంత్రి పదవిని 2021 జూలై 8న చేపట్టారు. ఆయన 2019 మే నుంచి 2021 జూలై వరకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి)గా వ్యవహరించారు.
పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ మేఘవాల్ ఇప్పుడు న్యాయ శాఖ బాధ్యతలను కూడా చేపట్టనున్నారు. గతంలో ఆయన చీఫ్ విప్‌గానూ, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగానూ పని చేశారు. ఆయన రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుంచి 2009లో లోక్‌సభ సభ్యునిగా మొదటిసారి గెలిచారు. ఆయనకు 2013లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం లభించింది.