Sunday, January 19, 2025
HomeTrending Newsహస్తినలో నేడు కిసాన్‌ మహా పంచాయత్‌

హస్తినలో నేడు కిసాన్‌ మహా పంచాయత్‌

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్‌పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) సోమవారం కిసాన్‌ మహా పంచాయత్‌ నిర్వహిస్తున్నది.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరిగే ఈ మహా పంచాయత్‌కు దేశంనలుమూలల నుంచి లక్షలాది మంది రైతులు తరలివస్తున్నారని ఎస్కేఎం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రైతుల కష్టాలు తీర్చేందుకు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేసింది. జేపీసీకి పంపిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఎస్కేఎం, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు చేసిన తర్వాతనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతామనే హామీని కేంద్రం ఇవ్వాలని పేర్కొన్నది. కాగా, 11 రాష్ర్టాల నుంచి రైతులు శనివారం నుంచే ఢిల్లీకి రావడం ప్రారంభమైందని పొలీసులు తెలిపారు.

జంతర్‌ మంతర్‌ వద్ద అనుమతి నిరాకరణ
రైతుల ఆందోళనకు ఢిల్లీ పోలీసులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద రైతులు ర్యాలీ చేపట్టేందుకు అనుమతి నిరాకరించారు. 30 వేల మంది రైతులు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరగా, బడ్జెట్‌ సమావేశాల పేరుతో నిరాకరించారని, రాంలీలా మైదానంలో ర్యాలీ చేసుకోవాలని సూచించారని ఏఐకేఎస్‌ నేత హన్నన్‌ మొల్లా తెలిపారు. హామీలను అమలు చేయని కేంద్రంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తాను ఇచ్చిన హామీలనే నెరవేర్చని బీజేపీ ప్రభుత్వానికి విశ్వసనీయత ఎక్కడ ఉన్నదని విమర్శించారు.

రైతుల కష్టాలు పట్టవా?
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు తాజాగా మహారాష్ట్ర ఉల్లి రైతుల ఆందోళనలే సాక్ష్యమని మొల్లా పేర్కొన్నారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు 11 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. దేశానికి అన్నం పెడుతున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. పంట నష్టాలు రైతు వెన్ను విరిచాయని, సమీప భవిష్యత్తులో వారు కోలుకొనే పరిస్థితి లేదని, ఈ నేపథ్యంలో ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. రైతులకు నష్టం చేకూర్చే విద్యుత్తు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

పంటను రోడ్లపై పోస్తున్న రైతులు
దేశవ్యాప్తంగా రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర లేక నష్టపోతున్నారని హర్యానాకు చెందిన బీకేయూ(టికాయిత్‌) అధ్యక్షుడు రతన్‌ మన్‌ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో బంగాళదుంపల రైతులు, మహారాష్ట్రలో ఉల్లి రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూస్తున్నామని, మద్దతు ధర లేక పంట ఉత్పత్తిని రోడ్లపై పారపోస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానాలో కూడా ఆవాల పంటను రైతులు తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సి వస్తున్నదని, క్వింటాల్‌కు రూ.5,450 ఎంఎస్పీ ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోవడంతో ప్రైవేటు కొనుగోలుదారులు రూ.4,400కే రైతుల వద్ద నుంచి పంట ఉత్పత్తిని సేకరిస్తున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్