కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసం చేసిందని రైతాంగం రగిలిపోతోంది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై మళ్లీ ఉద్యమానికి రైతాంగం సిద్ధమవుతున్నది. ఎంఎస్పీకి చట్టబద్ధత, విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరణ, రుణమాఫీ వంటి డిమాండ్ల సాధన కోసం మార్చి 20 నుంచి ఆందోళనలను పునఃప్రారంభిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. ఇందులో భాగంగా మార్చి 20న పార్లమెంట్ ముందు కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తామని ప్రకటించింది.
హర్యానాలోని కురుక్షేత్రలో ఎస్కేఎం నేతల సమావేశం అనంతరం రైతు నేత యుధ్‌వీర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మార్చి 20న దేశం నలుమూలల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ చేరుకొంటారని తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందనకు అనుగుణంగా తదుపరి ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. పంటల ఎంఎస్పీకి చట్టబద్ధత, విద్యుత్తు సవరణ బిల్లు-2022 ఉపసంహరణ, రైతాంగ ఉద్యమంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు పరిహారం, కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాని తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను రైతు వ్యతిరేక బడ్జెట్‌గా ఎస్కేఎం నేతలు ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ విఫలమైందని విమర్శించారు.