Dedication: రోడ్డు మీద నడుస్తుంటే చెత్తా చెదారం కనిపిస్తుంది. మనకెందుకులే అని ముక్కు మూసుకుని వెళ్లి పోతాం. ఎక్కడ పడితే అక్కడ నడవడానికి లేకుండా వాహనాలు పార్క్ చేస్తే , సందు వెతుక్కుని వెళ్ళిపోతాం. వీధి దీపాలు వెలగక పోయినా, మురుగునీరు పారుతున్నా మనది ఎప్పుడు పలాయనవాదమే.
ఇలా చూస్తే రోజూ ఎన్నో విషయాలు తప్పించుకుని వెళ్ళిపోతాం. మనకెందుకులే అని నిర్లిప్తత. ఒకవేళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ చర్యా ఉండదు. గొడవపడినా మనకే నష్టం. ఇవన్నీ ఆలోచించి చుట్టూ ప్రపంచం ఎంతగా కలుషితమవుతున్నా కళ్ళు, ముక్కు , నోరు మూసేసుకుని బ్రతకడం అలవాటు చేసుకున్నాం. కానీ అప్పుడప్పుడు కొందరు తగులుతారు. వారిని చూసి మనం సిగ్గుతో తల వంచుకోవలసి వస్తుంది. అటువంటి వ్యక్తే చంద్ర కిషోర్.
‘ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూ దారిలో నీలాంబరి
మా సీమకే చీనాంబరి ‘… అంటూ వేటూరి వారు గోదావరి నది గొప్పతనం కళ్ళకు కట్టినట్టు వివరించారో పాటలో. నదీమతల్లులను వాడుకోవడమే గానీ కాపాడటం తెలియదు మనకు. ఏది పడితే అది నదుల్లో విసిరేస్తూ ఉంటాం. ముఖ్యంగా పుణ్య క్షేత్రాలున్న చోట నదుల పరిస్థితి దయనీయం. వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ప్రభుత్వాలు, ప్రజలు కళ్ళు మూసుకున్నా తాను ఊరుకునేది లేదంటున్నాడు ఒక్కడు. ఆ ఒక్కడే చంద్ర కిషోర్ పాటిల్.
నాసిక్ లోని ఇందిరానగర్ వాసి. ప్రతిరోజూ ఉదయాన్నే నది వద్దకు వెళ్తాడు. ఎవరైనా చెత్త వేయబోతే విజిల్ ఊది వారిస్తాడు. కొన్ని సీసాల నిండా గోదావరి నీరు పట్టి ఉంచుతాడు. చెత్త వేయద్దన్నందుకు ఎవరన్నా గొడవపడితే వారిని సీసాల్లో నీరు తాగమంటాడు. నిరాకరిస్తే నీరు ఎంతగా కలుషితమైందో వివరిస్తాడు. అంతా విన్నాక చెత్త వేయలేరు. ఇలా గంటో రెండుగంటలో కాదు , రాత్రి పదకొండింటి వరకు చంద్ర కిషోర్ నది దగ్గరే ఉంటాడు. గోదావరి తల్లిని కంటికి రెప్పలా కాచుకుని ఉంటాడు. ఇటువంటి నిస్వార్థ పుత్రుల అవసరం ప్రతి నదికి ఉంది. నదులకే కాదు, నడవడానికి ఇబ్బందిగా రోడ్ల పైన వాహనాలు పార్క్ చెయ్యకుండా, చెత్త వెయ్యకుండా, ఆక్రమణలు కాకుండా కాపాడే చంద్ర కిషోర్ లు తక్షణ అవసరం.
-కె. శోభ
Also Read :