Friday, April 19, 2024
HomeTrending Newsవిషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

ఆత్మహత్యకు యత్నించిన కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య చదువుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ప్రీతికి రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్‌లో యూనిట్‌లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వెంటిలేటర్‌‌పై ఉన్న ఆమెకు సీఆర్ఆర్‌టీ డయాలసిస్ చేస్తున్నామని పేర్కొ్న్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ప్రకటించారు.

హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు గవర్నర్ తమిళిసై ఆస్పత్రికి వెళ్లారు. ప్రీతి కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. త్వరగా కోలుకుని మళ్లీ యథాస్థితికి రావాలని తమిళిసై ఆకాంక్షించారు. ప్రీతి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని గవర్నర్ వెల్లడించారు.

ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. వైద్య విద్యార్థిని ప్రీతి సంఘటన బాధాకరమన్నారు. ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్‌ వైద్యులను ఆదేశించారు. ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన హరీశ్ రావు.. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎంలో జరిగిన ఘటనపై నలుగురు ప్రొఫెసర్లతో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ కమిటీ తమ నివేదికను సీల్డ్ కవర్‌లో నేడు డీఎంఈకి పంపనుంది. కాగా సైఫ్‌ను కాపాడేందుకు కేఎంసీ అధికారులు, ఎంజీఎం వైద్యులు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా సైఫ్ వైద్య డిగ్రీ పట్టాను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రీతి గదిని పరిశీలించిన పోలీసులు సెల్ ఫోన్‌లో వాట్సాప్ చాటింగ్‌తోపాటు పలు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ‎మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్