Don’t get into trap: చంద్రబాబు ఉచ్చులో పడొద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని సూచించారు. జగన్ ను అధికారంలో నుంచి దించేందుకు కులాలు,మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేసున్నారని, అలాంటి కుత్రాల్లో బలిపశువులు కావొద్దని పవన్ కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా పవన్ వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తల్లి లాంటి సినిమాను రాజకీయాలకు వాడుకోవడం పవన్ కు సరికాదన్నారు. ఈ వ్యవహారాన్ని పవన్ కు, జగన్ కు మధ్య యుద్ధంగా చూపించేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ కు అందాల్సిన రెమ్యునరేషన్ అందిందని, సినిమా ఆడినా, ఆడకపోయినా ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. జగన్ పై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశం, పట్టుదల కోసమే సినిమాను ముందు విడుదల చేశారని నాని విమర్శించారు.
భీమ్లా నాయక్ సినిమాకు తమ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి షరతులూ పెట్టలేదని నాని స్పష్టం చేశారు. అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇవే షరతులు ఉన్నాయని, సిఎం జగన్ కు మిత్రుడు నాగార్జున నటించిన, తమ కేబినేట్ సహచరుడు కురసాల కన్నబాబు తమ్ముడు దర్శకత్వం వహించిన బంగార్రాజు సినిమాకు కూడా ఇవే ఉన్నాయన్నారు. పవన్ సినిమా కాబట్టి నిబంధనలు పెట్టారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒకటేనన్నారు. సిఎం జగన్ మిత్రులు, శత్రువుల గురించి ఆలోచించరని కేవలం ప్రజల గురించే ఆలోచిస్తారని వ్యాఖ్యానించారు.
టికెట్ రేట్లకు సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని, జీవో విడుదలపై లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉందని కొడాలి నాని వెల్లడించారు.