పశ్చిమబెంగాల్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సిబిఐ విచారణకు కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల ఫలితాలు మే 2 న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నందిగ్రామ్ నుంచి పోటీచేసిన మమతా బెనర్జీ, ఒకప్పటి తన పార్టీ సహచరుడు, బిజెపి అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు.
ఫలితాలు వెలువడిన వెంటనే తృణమూల్ కార్యకర్తలు రాష్ట్రంలో పలు బిజెపి కార్యాలయాలపై, కార్యకర్తలపై దాడులు చేశారు. ఈ హింసలో పలువురు బిజెపి కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం ఈ హింసపై తీవ్రంగా స్పందించింది. ఆ రాష్ట్ర గవర్నర్ ను వివరణ కోరింది. ఈ హింసాకాండపై పలువురు కోల్‌కత్తా హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై ఐదుగురు న్యాయమూర్తులతో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మొత్తం సంఘటనలపై సీబీఐ విచారణ జరపాలని, చెందిన సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో దర్యాప్తు జరిపించాలని కోల్‌కత్తా హైకోర్టు ఆదేశించింది.