Thursday, April 25, 2024
Homeసినిమా‘సావిత్రి w/o సత్యమూర్తి’ టీజర్ విడుదల

‘సావిత్రి w/o సత్యమూర్తి’ టీజర్ విడుదల

‘దిస్ ఈజ్ సత్యం. క్లాస్ టచ్, మాస్ కటౌట్! ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు నాలాంటోడు’ అని ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం అంటున్నారు. రెండు పదుల వయసున్న యువకుడిగా, సత్యమూర్తి పాత్రలో ఆయన నటించిన సినిమా ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. అరవైయేళ్ల మహిళగా, ఆయన భార్య పాత్రలో ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి నటించారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని బుధవారం సినిమా టీజర్ విడుదల చేశారు.

‘భూమి పుట్టకముందు పుట్టాడు. అయినా ముసలోడు అవ్వలేదు. ఇంకా కుర్రాడిలా ఉన్నాడు’ అని ఓ వ్యక్తి… ‘అసలు నువ్వు తండ్రిలా ఉన్నావా? తమ్ముడిలా ఉన్నావ్! కొన్నాళ్లు పోతే కొడుకులా ఉంటావ్’ అని పార్వతీశంపై సుమన్ శెట్టి విరుచుకుపడటం… ‘సత్యమూర్తికి 1980లో పెళ్లైంది. సత్యం ఇలా ఉండటానికి ఏదో రీజన్ ఉంది’ అని న్యూస్ ప్రజెంటర్ చెప్పడం… ‘నీ సీక్రెట్ ఏంటో నాకు తెలిసేంత వరకూ ఈ సింహం నిద్రపోదు. నిద్రపోనివ్వను’ అని హాస్యనటుడు గౌతమ్ రాజు అనడం… ఇవన్నీ చూస్తుంటే, హీరోకి ఎంత వయసు వచ్చినా యువకుడిలా ఉంటున్నాడనే సంగతి అర్థం అవుతోంది. అయితే, అతడు యువకుడిలా ఉండటానికి గల రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలని దర్శకుడు చైతన్య కొండ చెబుతున్నారు.

నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ.. “గోపీచంద్ మలినేనిగారు టీజర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు థాంక్స్. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. అన్ని వర్గాలను, అన్ని వయసుల వాళ్లను అలరించే చిత్రమిది” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్