Sunday, January 19, 2025
Homeఫీచర్స్కలకత్తాలో సరికొత్త మెట్రో సేవలు ఆరంభం

కలకత్తాలో సరికొత్త మెట్రో సేవలు ఆరంభం

పశ్చిమబెంగాల్‌ రాజధాని కలకత్తాలో దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడి బుధవారం ప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో న‌ది కింద ఈ ట‌న్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కలకత్తాలో ర‌వాణా వ్యవ‌స్థ సుల‌భ‌త‌రం కానున్నది. బుధవారం నుంచే ఈ మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్‌ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాని తొలిసారి ఈ మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్ల వ్యయంతో ఈ మార్గాన్ని ఇంజినీరింగ్‌ అద్భుతంగా పేర్కొనవచ్చు. కలకత్తా తూర్పు – పశ్చిమ మెట్రో మార్గం మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. ఇందులో 10.8 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉంటుంది. ఇందులో 4.8 కిలోమీటర్లు హుగ్లీ నది కింద టన్నెల్‌లో ఉండగా.. మిగిలింది భూ ఉపరితలంపై ఉంటుంది. ఈ మార్గం కలకత్తాలోని హౌరా, సాల్ట్‌ లేక్‌లను కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉండగా అందులో మూడు భూగర్భంలో…మూడు భూ ఉపరతలంపై ఉన్నాయి.

హౌరా మెట్రో స్టేషన్ మన దేశంలో అత్యంత లోతులో నిర్మించిన మెట్రో స్టేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. నీటి అడుగున 16 మీటర్ల లోతులో నిర్మించిన టన్నెల్ గుండా మెట్రో రైళ్లు పరిగెత్తనున్నాయి. మన దేశంలో తొలిసారి మెట్రో రైలు సేవలు కలకత్తాలోనే ప్రారంభం అయ్యాయి. 1984లో కోల్‌కతా మెట్రో రైలు పట్టాలెక్కగా… తాజాగా నది గర్భంలో అండర్ వాటర్ మెట్రో రైలు పరుగులు పెట్టడంతో మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది.

అండ‌ర్‌వాట‌ర్ మెట్రోతో పాటు క‌వి సుభాష్‌- హేమంత ముఖోపాధ్యాయ మెట్రో స్టేష‌న్‌, త‌ర‌తాలా-మ‌జేర్‌హ‌ట్ మెట్రో సెక్షన్‌ను ప్రధాని ఇవాళ ప్రారంభించారు. 2009, ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, ఈస్ట్ వెస్ట్ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి యూపీఏ 1 ప్రభుత్వ విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు.

ఆ తర్వాత ఉత్తర 24 పరగణ జిల్లా బారాసత్ లో ఏర్పాటు చేసిన నారీ శక్తి వందన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. సందేశ్ ఖలి అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని నిందితుల్ని కాపాడేందుకు తృణముల్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని మోదీ వెంట పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఉన్నారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఆహ్వానం ఉన్నా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్