రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ -10లో నూతనంగా నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని ఈ రోజు సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఆదివాసీ బిడ్డలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ భవనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అస్తిత్వాన్ని కోల్పోయిన తెంలగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని సొంత రాష్ట్రంగా వచ్చిన ఈ సందర్భంలో ఆదివాసీ గిరిజన బిడ్డలు, లంబాడీ బిడ్డలు అందరికీ కూడా మేం తల ఎత్తుకుని ఇది మా రాష్ట్రం, ఇది మా కుమ్రం భీం ఆదివాసీ భవన్ అని చెప్పుకునేటటువంటి మంచి కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మాణం చేసుకున్నాం. చాలా చాలా సంతోషం.
ఈ రోజు ఈ భవనం తనతో ప్రారంభింపజేసుకున్నందుకు తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు సమస్యలు చాలా ఉన్నాయి. భవనం కట్టుకోగానే అయిపోదు. ఇల్లు అలకగానే పండుగ కాదు. గిరిజన బిడ్డల యొక్క సమస్యలు తీరవలసిన అవసరం ఉంది. కొంత కొంత ఒక్కో అడుగు పడుతుంది. చదువుకునే విషయంలో కానీ, విదేశాలకు వెళ్లే విషయంలో కానీ, గిరిజన పోడు భూముల విషయంలో కానీ, ఆదివాసీ బిడ్డల రక్షణ విషయంలో కానీ, కొద్దిగా మనం పురోగమిస్తున్నాం. ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. ఈ భవనం యావత్ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆదివాసీ బిడ్డల హక్కుల పరిరక్షణ వేదిక కావాలి. వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలి. ఆదివాసీ నాయకులు, ముఖ్యంగా మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వారు ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఈ భవనం వేదికగా మీరు కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
Also Read : హైదరాబాద్లో మెడికల్ టూరిజం అభివృద్ధి మంత్రి హరీష్