రాజకీయ ఎత్తుగడలో భాగంగానే  వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు అనేది ఓ బూటకమని అభివర్ణించారు. అమరావతి రాజధానిపై హైకోర్టు ఎప్పుడో తీర్పు చెప్పిందని, ఆ తీర్పుపై ఇప్పుడు సుప్రీంకు వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు.

రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే అయినప్పటికీ న్యాయవ్యవస్థకు లోబడి నిర్ణయాలు ఉండాలని, ఏకపక్షంగా  నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం జోక్యం చేసుకునే అంశం కాకపోయినా, గతంలో చేసిన సీఆర్డీఏ  చట్టాలు, రైతులతో చేసుకున్న ఒప్పందాలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.  ఈ అంశంపై మరో బిల్లు తెచ్చే అవకాశం లేనందున, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రయత్నమని వ్యాఖ్యానించారు.  మూడు రాజధానుల అంశం  తెరపైకి వచ్చిన తరువాత ఆయా ప్రాంతాల్లో కనీసం మూడు బిల్డింగులు కూడా కట్టలేకపోయారని విమర్శించారు.

మరోవైపు హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకాలం ఎందుకు పట్టిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ నిలదీశారు. మూడు రాజధానులపై అంత విశ్వాసం ఉంటే కాలయాపన ఎందుకు చేశారని అడిగారు. హైకోర్టులో ధర్మం జయించిందని, అదే రీతిలో సుప్రీం కోర్టులో కూడా ధర్మమే జయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: మూడు రాజధానులపై  సుప్రీంకోర్టుకు ఏపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *