World Famous Painter: స్వాతంత్ర్య సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లేకపోతే మనకు ఈమాత్రం లేపాక్షి దొరికి ఉండేది కాదు. ఆయన హిందూపురం నియోజకవర్గానికి తొలి శాసనసభ్యుడు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా తన ఉన్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీకే దానమిచ్చిన ఉదారుడు. నిష్కళంక దేశభక్తుడు. నిగర్వి. సంస్కృతం, తెలుగు, కన్నడ సాహిత్యాల్లో అభినివేశం ఉన్నవాడు. విజయనగర ప్రభువుల సాంస్కృతిక వైభవానికి గుర్తులుగా మిగిలి ఉన్న బళ్ళారి, హంపీ, అనంతపురం, పెనుగొండ, లేపాక్షిలలో విస్తృతంగా తిరిగినవాడు. లేపాక్షికి సమీపంలోని కల్లూరులో పుట్టినవాడు. లేపాక్షి రుణం తీర్చుకున్నవాడు. 1530లలో లేపాక్షిని విరుపణ్ణ ఆవిష్కరిస్తే…తరువాత మట్టి దిబ్బగా మారి…నిత్య ధూప దీప నైవేద్యాలు లేక…తన ఉనికిని తనే మరచిపోయిన అదే ఆలయాన్ని కల్లూరు సుబ్బారావు కొన్ని దశాబ్దాల ప్రయత్నంతో పునరావిష్కరించారు. లేపాక్షి తొలి సర్పంచ్ గా అయిదు దశాబ్దాల పాటు అప్రతిహతంగా పనిచేసిన లేపాక్షి వెంకటనారాయణప్ప ఈ యజ్ఞంలో కల్లూరుకు కుడి భుజంగా పని చేశారు. ఆలయ చరిత్ర అందరికీ తెలియాలన్న తపనతో ఆయనే స్వయంగా 1966 లో ‘లేపాక్షి దేవాలయ చరిత్ర’ పేరుతో పుస్తకం రాసి ప్రచురించారు.
కల్లూరువారు పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ తరపున వెలువరింపచేసిన “లేపాక్షి” ఇంగ్లిష్ పుస్తకం లేపాక్షికి అక్షరాలా నిఘంటువుతో సమానం. నెల్లూరులో 1907లో జన్మించిన ఆమంచర్ల గోపాలరావు రచన ఇది. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి రచయిత, చిత్రకారుడు. అనేక నాటకాలు రాశారు. తెలుగు, హిందీ సినిమాల్లో సహాయదర్శకుడిగా పనిచేశారు. రెండు తెలుగు సినిమాలకు దర్శకుడు. చారిత్రిక విషయాలమీద అంతులేని ఆసక్తితో అనేక వ్యాసాలు రాశారు. వృత్తిరీత్యా ఆకాశవాణిలో అనౌన్సర్ గా విజయవాడలో పదవీవిరమణ తరువాత రచనల్లో మునిగి తేలారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు ఉన్నవారు. ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ లేపాక్షి మీద పరిశోధించి పుస్తకం రాయడానికి ఆమంచర్లను ఎంచుకుంది. దాదాపు నాలుగేళ్లపాటు లేపాక్షి ఆలయాన్ని అధ్యయనం చేసి ఆయన 1968లో రాసిన పుస్తకం 1969 లో ప్రచురితమయ్యింది. కానీ ఆయన పుస్తకం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే ఆయన కన్ను మూశారు.
ఆమంచర్ల పుస్తకంలో ప్రఖ్యాత తెలుగు చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు లేపాక్షి చిత్రాలు ఫొటోలకంటే ఆకర్షణీయంగా ఉన్నాయి. కొన్ని నెలలపాటు శేషగిరిరావుగారు లేపాక్షి ఆలయంలో కూర్చుని ఆ చిత్ర కళా ఖండాలను తీర్చి దిద్దారు.
ఆమంచర్ల భారతీయ కళ దగ్గర మొదలు పెట్టి…దక్షిణ భారత కళ, 1530కి ముందు వెయ్యేళ్ళల్లో ఆలయ నిర్మాణ శైలులు, విజయనగర ఆలయాల ప్రత్యేకతల మీదుగా లేపాక్షి ఆలయ వర్ణనలోకి వచ్చారు. ఆలయంలో ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టలేదు. చారిత్రిక, ఆధ్యాత్మిక, ఆగమ, శిల్ప, చిత్ర, సాంఘిక అంశాలన్నిటినీ శాస్త్రీయ ప్రమాణాలతో విశ్లేషించారు. తను లేపాక్షి మీద రాసింది సుదీర్ఘ పరిచయవ్యాసం అని అత్యంత వినయంగా చెప్పుకుని…క్రెడిట్ అంతా కల్లూరు సుబ్బారావుకు, చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావుకు, లలిత కళా అకాడెమీకి ఇచ్చారు. నిజానికిది వెయ్యి పరిశోధన గ్రంథాలతో సమానం.
(ఈరోజు-2024 జనవరి 27 కొండపల్లి శేషగిరి రావుగారి శతజయంతి సందర్భంగా లేపాక్షి ఆలయం మీద రాసిన ధారావాహిక నుండి కొంత నెమరువేత ఇది. ఈవ్యాసంతో కొండపల్లివారి కుమారుడు కొండపల్లి వేణుగోపాల రావు గారు(ఇంజనీరుగా రిటైరయ్యారు)నాకు పరిచయమయ్యారు. అప్పుడు అమెరికాలో ఉన్న ఆయన నాకు ఫోన్ చేసి…వారింటికి కల్లూరు సుబ్బారావు వచ్చి…లేపాక్షి చిత్ర యజ్ఞాన్ని వారి నాన్న చేత చేయించిన మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. కొండపల్లివారి కుంచె తీర్చి దిద్దిన లేపాక్షి బొమ్మలు అసలైన లేపాక్షి శిల్పాల కంటే అందంగా ఉంటాయి. మాట్లాడుతూ ఉంటాయి. కొన్ని నెలలపాటు లేపాక్షి ఆలయంలో కూర్చుని ఆయన లేపాక్షి చిత్రాలను ఎంత దీక్షగా చిత్రించారో వివరిస్తూ మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్య ఎన్నో వ్యాసాల్లో ఆ సంగతులను ప్రస్తావించారు. కొండపల్లి వారి కీర్తి కిరీటంలో లేపాక్షి ఒక కలికి తురాయి మాత్రమే. ఆయన కిరీటంలో ఒదిగిన మణి మాణిక్యాల లేపాక్షులు లెక్కలేనన్ని ఉన్నాయి.
తెలుగు చిత్రకళను ప్రపంచ యవనిక మీద జయకేతనంగా ఎగురవేసిన ఓరుగల్లు బిడ్డ కొండపల్లి శేషగిరిరావు గారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడమంటే మనల్ను మనం గౌరవించుకోవడమే)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018