Friday, March 29, 2024
Homeసినిమాతెలుగు పాటకు కొత్త సొగసులు దిద్దిన కొసరాజు

తెలుగు పాటకు కొత్త సొగసులు దిద్దిన కొసరాజు

తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేసిన కవులు, రచయితలు ఎంతోమంది ఉన్నారు.  అలాంటి వారిలో  కొసరాజు రాఘవయ్య  చౌదరి ఒకరు.  తెలుగు పాటకు కొత్త సొగసులు దిద్ది .. కొత్త మెరుపులు అద్ది .. పడుచుదనంతో పరుగులు తీయించినవారాయన. పాట తేలికైన పదాలతో ఉండాలి .. అందులోని భావం తీయగా ఉండాలి .. ఆ తీపిదనలో ఒక చురుక్కు .. ఒక చమక్కు ఉండాలి అని నమ్మిన కవి ఆయన. తెలుగు పాటకు జానపదాల అందెలు కట్టి .. కొత్త నడకలు నేర్పిన వారాయన. జానపదం రాయడం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ రాయలేరని నిరూపించినవారాయన.

కొసరాజు .. గుంటూరు జిల్లా ‘చింతాయపాలెం’ గ్రామంలో జన్మించారు. ఆయనకి ఆ గ్రామీణ వాతావరణం ఇష్టం .. అక్కడి గ్రామీణ ప్రజలు పాడుకునే పాటలు ఇష్టం. అలా ఆయన బాల్యం నుంచే  తెలుగు జానపదాల వైపు ఆకర్షించబడ్డారు. ఆ వయసులోనే ఆయన రామాయణ .. భారత .. భాగవతాలను చదివి అర్థం చేసుకున్నారు. అలాగే యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి ఆయన లోకం పోకడను పరిశీలించారు. హరికథలు .. బుర్రకథలు .. భజనగీతాలు రాయడం మొదలు పెట్టారు. అప్పట్లో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వాటినే ఎక్కువగా పాడుకునేవారు.

అలా ఆయన నిరంతరం సాహిత్యానికి సంబంధించిన యజ్ఞం చేస్తూనే, జర్నలిస్టుగాను తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే గూడవల్లి రామబ్రహ్మంతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా కొసరాజు మొదటిసారిగా ‘రైతు బిడ్డ’ సినిమా కోసం పాటలు రాశారు. ఆ తరువాత కొంతకాలానికి ‘పెద్దమనుషులు’ సినిమాకి పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఆయన రాసిన ‘శివ శివ మూర్తివి గణనాథా ..’ .. ‘నందమయా గురుడ నందమయా . ‘ పాటలు జనంలోకి దూసుకుపోయాయి. అంతే ఇక అప్పటి నుంచి పాటల రచయితగా ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.

శ్రీశ్రీ .. సినారే .. ఆరుద్ర .. ఆత్రేయ వంటి కవులెందరో తమదైన శైలిలో పాటలను ప్రభావితం చేస్తుంటే, కొసరాజు గారు తన దైన ప్రత్యేకతను చాటుతూ ముందుకు వెళ్లారు. ముఖ్యంగా పాటలు రాయడానికి ఆయన పల్లె భాషను ఎంచుకున్నారు. పామరులకు కూడా అర్ధమయ్యే వాడుక పదాలతోనే ప్రయోగాలు చేశారు. పాటకు హాస్యాన్ని జోడించి అందించడం తన కలం లక్షణంగా చేసుకున్నారు. హాస్యంతో నడుస్తున్న పాట ద్వారానే సందేశాన్ని ఇవ్వడమనే ఒక కొత్త ప్రక్రియకు పట్టంకట్టారు. అలా ఆయన కలం తెలుగు ప్రేక్షకుల హృదయాలలో జానపదాల జడివాన కురిపించింది.

‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా’ (రోజులు మారాయి) పాట వింటే పల్లె జీవితంపై ఆయనకి ఎంత పట్టుందో .. అక్కడి భాషపై ఆయనకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అందువల్లనే పల్లె నేపథ్యంలోని పాట రాయాలంటే కొసరాజునే రాయాలి. వ్యంగం .. హాస్యం కలగలిసిన పాట ద్వారా నీతిని బోధించాలంటే కొసరాజునే రాయాలి అనే పేరు  వచ్చింది. ‘సరదా సరదా సిగరెట్టు’ (రాముడు భీముడు) ‘అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే’ (కులగోత్రాలు) ‘టౌను పక్క కెళ్లద్దురో డింగరీ’ (తోడి కోడళ్లు)  ‘అనుకున్నది ఒక్కటీ అయినది ఒక్కటీ”(మంచి మనసుకు మంచి రోజులు)  పాటలు వింటే .. ఈ రోజుకీ వాటిని అన్వయించుకోకుండా ఉండలేము .. అనుభూతిని పొందకుండా వదల్లేము.

అలా ఆయన రాసిన కొన్ని పాటలు వింటే అవి శ్రీశ్రీ రాశాడేమో అనుకుంటాము .. మరి కొన్ని పాటలు వింటే అవి సినారె కలం నుంచి జాలువారాయేమోనని అనుకుంటాము. అంతలా వారి సాహిత్యానికి దగ్గరగా కూడా ఆయన తన పాటల పరిమళాలను వెదజల్లారు. ‘నిలువవే వాలుకనుల దాన’  .. ‘పదపదవే వయ్యారి గాలిపటమా’ .. ‘బులి బులి ఎర్రని బుగ్గల దానా’ .. ‘గౌరమ్మా నీ మొగుడేవరమ్మా’ .. ‘ముద్దబంతి పూలు పెట్టి .. మొగలి రేకును జడను చుట్టి’  .. ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే’ మొదలైన పాటలు ఆ జాబితాలో మనకి కనిపిస్తాయి.

 

ఇక భక్తి  గీతాలు .. దేశభక్తి గీతాలు రాయడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘శ్రీశైలా .. మల్లన్నా’ (కృష్ణవేణి) .. ‘రామయ్య తండ్రి .. ఓ రామయ్య తండ్రి’ (సంపూర్ణ రామాయణం) ‘ జయమ్ము నిశ్చయమ్మురా’ ( శభాష్ రాముడు)  ఇలా ఎన్నో పాటలను ఆయన అందంగా .. అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ‘లవ కుశ’ సినిమా కోసం ఆయన రాసిన ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే పాట తలమానికంగా నిలుస్తుంది. నిజంగా సీతమ్మవారిని అడవుల్లో వదిలేసి రావడానికి వెళుతున్నప్పుడు లక్ష్మణుడు పొందిన వేదనకు ఆయన ఇచ్చిన అక్షర రూపాన్ని ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేరు.

పల్లె ఒడి .. పల్లె బడి .. పల్లె నుడి .. జానపదాల నాడి కొసరాజుకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో అన్నట్టుగా ఆయన పాటలు ఉంటాయి. అందువల్లనే ‘జానపదాల రసరాజు .. మా కొసరాజు’ అని సినారె ప్రశంసించారు. అప్పట్లోనే కాదు .. ఇప్పటికీ ఆయన పాటలను విని హాయిగా నవ్వుకోని వారు లేరు. ఆయన అనుభవసారాన్ని మనసులోనే అభినందించనివారు లేరు. ఇప్పటికీ అవి అమృత ధారాలే .. తెలుగువారి మనసు మైదానంలో కురుస్తున్న తేనె వానలే.  కొన్ని దశాబ్దాల పాటు తెలుగు పాటను ప్రభావితం చేసిన ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.

(అక్టోబర్ 27 కొసరాజు వర్ధంతి,  ప్రత్యేకం)

—  పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్