Saturday, April 20, 2024
HomeTrending Newsసిరిసిల్ల మరో కోనసీమ : కేటియార్

సిరిసిల్ల మరో కోనసీమ : కేటియార్

ఒకప్పుడు దుర్భిక్షంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు మరో కోనసీమలాగా మారుతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కేటియార్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ ది పేదల ప్రభుత్వమని, పేదవారి కళ్ళలో సంతోషం చూడడమే లక్ష్యమని అన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూముల్లో నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా ఇళ్లు కట్టించి ఇస్తున్నామని, రాష్ట్రం వ్యాప్తంగా లక్షలాది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని కేటియార్ వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ. 10.56 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆర్&బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కరిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, రాజ్య సభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటియార్ ఈ దఫా ఇళ్లు రానివారు నిరాశ పడాల్సిన అవసరం లేదని, వచ్చే ఏడాది నాటికి వారికి ఇళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్ళ నిర్మాణంతో వదిలి పట్టకుండా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని, ఈ కాలనీలన్నీ పచ్చదనంతో వెల్లివిరియాలని కేటియార్ సూచించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ ఎలాంటి పైరవీలు లేకుండా, అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా జరుగుతోందన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం ఇలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించడం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళతో పాటు ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్ళు కూడా అందిస్తున్నామని, అతి త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు, పించన్లు కూడా మంజూరు చేస్తామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్