పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని, నియోజక వర్గాల సన్నాహక సమావేశాలు నిన్న మొదలయ్యాయని టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు వెల్లడించారు. తెరాస ప్లీనరీ,తెలంగాణ విజయ గర్జన ఏర్పాట్లపై చర్చిస్తున్నామన్నారు. తెలంగాణభవన్ లో కేటిఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కరోనా వల్ల పార్టీ కార్యక్రమాలు కూడా స్తబ్దుగా మారాయన్నారు. వాక్సినేషన్ 93 శాతం పూర్తయ్యింది. కరోనా ప్రభావం తగ్గడం తో పార్టీ కార్యక్రమాల్లో జోరు పెంచామని, తొమ్మిది నెలల పాటు రకరకాల పార్టీ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
పార్టీ అధ్యక్షుడి గా కెసీఆర్ ను ప్రతిపాదిస్తూ ఇప్పటికే పది సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయని, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 24 న తెలంగాణ భవన్ లో ఉంటుందని కేటిఆర్ తెలిపారు. 25 న ప్లీనరీ hitex లో ఘనం గా నిర్వహిస్తున్నామని, 27వ తేదిన తెలంగాణ విజయ గర్జన సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఉంటాయన్నారు. తెలంగాణ విజయ గర్జన గొప్ప సభల్లో ఒకటిగా మిగిలి పోతుందని, ఆర్టీసీ బస్సులను ఆరు వేల వరకు ఇందుకు వినియోగిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతి డివిజన్లు సహా మొత్తం 16 వేల యూనిట్ల నుంచి వాహనాల్లో సభకు జనం వస్తారని, నవంబర్ 15 న ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది.. ఆరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్రం అనుకరించి అమలు చేస్తోందని, ప్రభుత్వానికే ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల పార్టీ కార్యక్రమాలు కొంత తగ్గాయి.. ఇపుడు పెంచుతున్నామని కేటిఆర్ వివరించారు. జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని, హుజురాబాద్ లో వంద శాతం విజయం సాధిస్తున్నామన్నారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డినే ఓడించాం. రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా అన్నారు. ఈటెల బీజేపీ బురదను అంటించుకున్నారని, బీజేపీని ఈటెల – ఈటెల బీజేపీ ని సొంతం చేసుకోవడం లేదన్నారు. జై ఈటెల అంటున్నరు తప్ప జై శ్రీరామ్ అని ఎందుకనడం లేదని, బీజేపీ అంటే ఓట్లు పడవనే ఈటెల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదా అని ప్రశ్నించారు. ఈటెల కు టీ ఆర్ ఎస్ ఎంతో చేసిందని, రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పడం లేదన్నారు. గెలిస్తే ఏం చేస్తాడో చెప్పక వేరే విషయాలు మాట్లాడుతున్నాడని, హుజూరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని కేటిఆర్ ఆరోపించారు. ఈటెల రేవంత్ కుమ్మక్కయ్యారన్నారు.
హుజురాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు కానీ రేవంత్ ముందస్తు ఎన్నికల గురించి చిలక జోస్యం చెబుతున్నాడని కేటిఆర్ ఎద్దేవా చేశారు. బలమైన అభ్యర్థిని కావాలనే కాంగ్రెస్ దింప లేదని, పీసీసీ అధ్యక్షుడు అయ్యాక తనను తాను నిరూపించుకోవాలి కదా.. ఎందుకు హుజురాబాద్ వెళ్లడం లేదని ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్నాసి చేయలేదని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని కేటిఆర్ అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో మమత గెలిస్తే మోడీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడా అన్న కేటిఆర్ తాను గెలిస్తే కెసీఆర్ అసెంబ్లీ కి రావద్దని రాజేందర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో భట్టి ది నడవడం లేదు. గట్టి అక్రమార్కులది నడుస్తోందన్నారు. దళితబంధును కొన్ని రోజులు ఆపగలరేమో.. నవంబర్ 3 తర్వాత ఆపగలుగుతారా అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం సమయం సందర్భాన్ని ఉంటుందని, నేను వేరే వారి లాగా చిలుక జోస్యం చెప్ప లేను అని కేటిఆర్ స్పష్టం చేశారు.
ఉద్యమ కారులు అసంతృప్తిగా ఉంటే ఇన్ని ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఎందుకు గెలుస్తుందన్న కేటిఆర్ ప్రజా ఆలోచనకు హుజురాబాద్ ఉప ఎన్నిక కచ్చితంగా ప్రతిబింబమే అన్నారు. నేను హుజురాబాద్ ప్రచారానికి వెళ్లడం లేదు. నాగార్జున సాగర్ దుబ్బాక కు కూడా వెళ్ళలేదన్నారు. సీఎం ప్రచారం కూడా ఇంకా ఖరారు కాలేదని, రేవంత్, ఈటెల తదితరులు టీ ఆర్ ఎస్ పై కుట్ర కు తెరలేపారు.. ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈటెల కు ఓటయ్యాలని లేఖ రాయడం ఏమిటీ అని ప్రశ్నించారు. హుజురాబాద్ కచ్చితంగా చిన్న ఎన్నిక అని టీ ఆర్ ఎస్ విజయాలు మీడియా కు కనిపించవన్నారు.
ప్రాంతీయ పార్టీ లు ఇరవయ్యేళ్లు మనగలడం గొప్ప విషయమని, ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ కేసీఆర్ పెట్టిన టీ ఆర్ ఎస్ లే ముందుకు సాగుతున్నాయని కేటిఆర్ చెప్పారు. నవంబర్ 15 తర్వాత నాతో పాటు కొంత మంది టీ ఆర్ ఎస్ నేతలు తమిళనాడు వెళ్తున్నామని అన్నా dmk, dmk పార్టీ సంస్థాగత నిర్మాణం పరిశీలిస్తామన్నారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమని కేటిఆర్ కొట్టిపారేశారు.