ఇండియా– బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ నేడు ధాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదలైంది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా గతవారం జరిగిన మొదటి టెస్టులో ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మొదటి టెస్ట్ లో బౌలింగ్ తో రాణించిన కుల్దీప్ యాదవ్ కు ఈ టెస్టు తుది జట్టులో స్థానం లభించలేదు. అతని స్థానంలో జయదేవ్ ఉనాద్కత్ కు చోటు కల్పించారు. ఇటీవలే ముగిసిన విజయ్ హరారే ట్రోఫీలో సౌరాష్ట్ర జట్టును విజయ పథంలో నడిపించిన ఉనాద్కత్ మంచి ఫామ్ లో ఉన్నాడు.
కుల్దీప్ ను పక్కన పెట్టడం బాధా కరమే అయినప్పటికీ, ఉనాద్కత్ ను తీసుకున్నామని, పిచ్ కండిషన్, పిచ్ పై తేమ, గడ్డి ఎక్కువగా ఉండడం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించామని, అందుకే ఆల్ రౌండర్ కేటగిరీ లో అశ్విన్, అక్షర్ పటేల్ లను ఎంపిక చేశామని కెప్టెన్ కెఎల్ రాహుల్ వెల్లడించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు లంచ్ సమయానికి 82 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్, ఉనాద్కత్ కు చెరో వికెట్ దక్కింది. అయితే లంచ్ అయిన వెంటనే ఉమేష్ మూడో వికెట్ పడగొట్టారు.