Black Day for Music: భారతరత్న, గాన కోకిల, జగద్విఖ్యాత గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. 1929 సెప్టెంబర్ 28న ఆమె జన్మించారు. 1942లో ఆమె సినీ రంగలో అడుగుపెట్టారు. మరాఠీ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించారు. 1947లో మజ్ బూర్ అనే సినిమా ద్వారా సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన గాన కోకిల అన్ని భారతీయ భాషల్లో దాదాపు 980 సినిమాలకు గాత్రం అందించారు, యాభై వేలకు పైగా పాటలు పాడారు.
కోవిడ్ లక్షణాలతో ఆమె ఈ ఏడాది జనవరి 8న ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన మంగేష్కర్ అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మధ్యలో ఆమె పరిస్థితి కొంత విషమించినా తర్వాత కాస్త కుదుటపడిందన్న వార్తలతో సంగీత ప్రపంచం తేరుకుంది. జనవరి 30న ఆమె కోవిడ్ నుంచి పూర్తిగా బైట పడ్డారని వైద్యులు వెల్లడించారు. అయితే వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1969లో పద్మ భూషణ్, 1989లో దాదా సాహెబ్ ఫాల్కే, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారత రత్న అవార్డులతో సత్కరించింది. 1999 నుంచి 2005 వరకూ రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్య సభ సభ్యురాలిగా కూడా పనిచేశారు. 1997లో మహారాష్ట్ర భూషణ్, 2006లో ఫ్రెంచ్ ప్రభుత్వపు అత్యున్నత పురస్కారం ‘లెజియన్ అఫ్ హానర్’ కూడా అందుకున్నారు.