సరిగ్గా ఏడాదయిందేమో భూటాన్ వెళ్లి. ఈసారి ఎక్కడికా అనుకుని అనేక ప్లాన్లు వేసి చివరకి లేహ్ – లడక్ వెళ్లాలని అనుకున్నాం. సరిగ్గా మూడేళ్ళక్రితం ఒక విమెన్ గ్రూప్ తో వెళ్లాలని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక నాన్న హఠాన్మరణంతో కాన్సెల్ చేసుకున్న లెహ్ ట్రిప్ మళ్ళా ఇప్పటికి కుదిరింది.
మోహిత అనే అమ్మాయి ‘ బియాండ్ బోర్డర్స్’ అనే సంస్థ పెట్టి మహిళలతో దేశ విదేశీ పర్యటనలు ఎంతో చక్కగా నిర్వహిస్తోంది. ఫ్యామిలీ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసి ఇస్తుంది. మా భూటాన్ ట్రిప్ కి కూడా తనే ప్లాన్ ఇచ్చింది. అందుకే లెహ్ మళ్ళా తనకే చెప్పా. ప్లాన్ ఓకే కాగానే బయల్దేరాం. అయితే ముందే వెళ్లిన వాళ్ళని అడిగితే ఫుడ్ సరిగా దొరకదని, వాతావరణం కష్టమని అన్నారు. దాంతో అన్నిరకాల మందులు, రెడీమెడ్ ఫుడ్ తీసుకెళ్ళాం. అయితే లేహ్ లో దిగి హోటల్ కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాం. కాసేపు పడుకుని లేచి చుట్టుపక్కల తిరిగి వచ్చాం కూడా. అయితే అందరికీ ఈ అదృష్టం ఉండదని మర్నాడు మా గైడ్ నవాంగ్ చెప్పాడు. చాలామందికి దిగగానే వాంతులు, తల తిరగడం ఉంటాయట. అందుకే రెస్ట్ తీసుకోమని, నీళ్లు బాగా తాగమని చెప్తారు.
చాలావరకు ఇక్కడి ఇళ్ల నిర్మాణం, సంస్కృతి, ఆహారం, బౌద్ధం … భూటాన్ లానే అనిపించింది. కాకపోతే ఎయిర్ పోర్ట్ మొదలుకొని అన్ని చోట్లా మిలిటరీ ఆధిక్యం కనిపిస్తూ ఉంటుంది. అందుకేనేమో హాయిగా ప్రశాంతంగా ఉంది. కార్గిల్ హాల్ ఆఫ్ ఫేమ్ చూశాక మిలటరీ మీద గౌరవం రెట్టింపైంది. లెహ్ నుంచి నుబ్రా వాలీ, అక్కడనుంచి పాంగోంగ్ లేక్ … మొత్తం వారం రోజులు. బంగీ జంపింగ్, జిప్ లైన్, విలువిద్య, ఒంటెల సవారీ,ఎటివి ( ఎనీ టెర్రయిన్ వెహికల్ )నడపడం వరకు సాహస కృత్యాలే. వీటన్నిటినీ మించి కొండ వాలు అంచులో ఉన్న సన్నటి మార్గంలో, రాళ్లు రప్పలతో నిండిన దారిలో ప్రయాణం రోమాంచకం. జత్స్చర్, ఇండస్ నదుల సంగమం, మాగ్నెటిక్ హిల్ కట్టిపడేస్తాయి. మంచుకొండల్లో ఖరుడుంగ్ లా పాస్, సియాచిన్ బేస్ క్యాంపు, 1971 యుద్ధంలో భారత సైన్యం స్వాధీనం చేసుకున్న టుర్టుక్, గాల్వన్ లోయ, కారాకోరం సరిహద్దులు ఒక విచిత్రమైన అనుభూతి కలిగిస్తాయి.
నిరంతరం దేశ రక్షణలో అందరికీ దూరంగా ఉన్న సైనికుల త్యాగం కదిలిస్తుంది. వీటన్నిటినీ మించి పాంగోంగ్ సరస్సు ఒక అపురూప చిత్రంలా ఆకట్టుకుంటుంది. పైన నీలి ఆకాశం, కింద నీలం సరస్సు చుట్టూ కొండలు .. ఆ దృశ్యం ఎంత వర్ణించినా చాలదు. మొదటిసారిగా త్రీ ఇడియట్స్ చిత్రంలో చూశాం ఈ సరస్సు. అలాగే భాగ్ మిల్కా భాగ్ తీసిన ఇసుక తిన్నెలు, జబ్ తక్ హై జాన్ తీసిన ప్రాంతాలు అప్పటినుంచి యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ అక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయాలు రెండు. ఎక్కడా ఒక పక్షి కనిపించలేదు. వారం రోజుల్లో ఒక్కటే పిట్ట కనిపించింది. అలాగే కొండలన్నీ గంభీరంగా తపస్సు చేస్తున్న మౌన రుషుల్లా ఉన్నాయే కానీ ఎక్కడా చెట్లు కనిపించలేదు.
సాధారణంగా ప్రకృతి సౌందర్యం అంటే పెద్ద వృక్షాలు చెట్లు, రంగురంగుల పూలు, పక్షులు, జంతువులు అనుకునేదానికి భిన్నంగా కొండలతో, అక్కడక్కడ జలపాతాలతో, ఒకటీ అరా జంతువులతో, ఇసుక తిన్నెలతో మరో రకమైన అద్భుత చిత్రం అనిపించింది. పైపెచ్చు ఎక్కడా మనకి విసుగు రాదు. ఆ కొండలనే విప్పార్చి చూస్తూ ఉంటాం. ఎత్తైన ప్రాంతం కావడం వల్ల అక్కడ వర్షాలు ఉండవు. చెప్పాలంటే మంచు ఎడారి. ఫలితంగా జీవవైవిధ్యం తక్కువ. అక్కడ పంటలు పండవు. అక్కడక్కడ ఆప్రికాట్ దొరుకుతుంది అంతే. అందుకే టమాటాల వంటివి ఎండబెట్టి నిల్వ ఉంచుకుంటారు. గొర్రెలనుంచి వచ్చే పష్మీనా ఊలు వారికి ఉపాధి. పాడీ పంటా చెట్టూ చేమ పక్షులు, జంతువులు లేకున్నా చుట్టూ కొండలతో దేశానికి కాపలా కాస్తున్న లడాఖ్ సీమ భారతదేశ ఔన్నత్యానికి ప్రతీక.
-కె. శోభ