Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-7

అదిగో లేపాక్షి-7

Latha Mandapam: విజయనగర ప్రభువుల కాలంలో ఆలయనిర్మాణంలో నైరుతివైపు కల్యాణమండపం ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం లేపాక్షి ఆలయంలో నైరుతివైపు శివపార్వతుల కల్యాణ మండపానికి సర్వం సిద్ధమయ్యింది. రాతి స్తంభాలు లేచాయి. సహజమైన ఉద్యానవనంలో పూలతీగలు సిగ్గుతో తలదించుకునేంత సుకుమార సోయగంతో లతామండపానికి చెక్కిన స్తంభాలు లేచి నిలుచున్నాయి. నెత్తిన కిరీటాలతో రాజర్షులు, జడలు కట్టిన జుట్లతో బ్రహ్మర్షులు వచ్చి నిలుచున్నారు. దిక్పాలకులు వచ్చి వారి వారి స్థానాల్లో నిలుచున్నారు. విష్ణువు, బ్రహ్మ ముందు వరుసలో ఉన్నారు. సకల వాద్యపరికరాలు తమంత తామే కదలి మోగడానికి రాతిలో గొంతువిచ్చి సిద్ధంగా ఉన్నాయి.

లేపాక్షి ఆలయ నిర్మాత విరుపణ్ణ కలల ప్రతిరూపమైన ఈ కళల కల్యాణమండపానికి ఏ దిష్టి తగిలిందో! కాలం ఎందుకు చిన్నచూపు చూసిందో! తెలియదు కానీ…కల్యాణమండపానికి పైకప్పు పడలేదు. తెచ్చిన రాళ్లు, చెక్కిన రాళ్లు కొన్ని కింద అలాగే పడి మూగగా ఆనాటినుండి రోదిస్తూనే ఉన్నాయి.

స్తంభంలో శివపార్వతుల కల్యాణం జరిగింది. రావాల్సినవారు వచ్చారు. కానీ విరుపణ్ణ కట్టాల్సిన కళల కల్యాణ గోపురం కలగా మిగిలిపోయింది. మండపం పైకప్పు కోసం చెక్కిన రాళ్లు కిందనే ఉండిపోయాయి.

ఈ కల్యాణ మండపం అర్ధాంతరంగా ఆగిపోవడానికి స్థానికులు చెప్పే కథ ఇది:-
లేపాక్షి ఆలయ నిర్మాణానికి విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయలు అనుమతించిన దానికంటే విరుపణ్ణ ఎక్కువగా ఖర్చుపెట్టాడని… కోశాగారానికి చేరాల్సిన ధనాన్ని అనుమతి తీసుకోకుండా సొంత నిర్ణయంతో ఆలయ నిర్మాణానికి ఉపయోగించాడని…ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో కోపగించిన ప్రభువు అప్పటి శిక్షాస్మృతి ప్రకారం అనుమతి లేకుండా కోశాగారం సొమ్ము వాడుకునే ఉద్యోగికి “కళ్లు పెరికించే శిక్ష” విధించాడని…ఇది తెలిసిన విరుపణ్ణ…చేయని తప్పుకు ఇంతటి శిక్షా? అయినా…రాజు ఆజ్ఞ ఆజ్ఞే…ఇంకొకరు నా కళ్లు పెరకడమేమిటి? నా కళ్లు నేనే పెరుక్కుని…నన్ను నేనే శిక్షించుకుంటాను…అని పట్టపగలు శిల్పులు, కార్మికులు అందరూ చూస్తుండగా కళ్లు పెరుక్కుని…అక్కడే గోడకు విసిరి కొట్టాడట! “ఇవే ఆ రక్తపు చారలు” చూడండి! అని ఇప్పటికీ లేపాక్షి గైడ్లు చూపిస్తున్నారు. అయ్యో విరుపణ్ణా! ఎంత పని జరిగిందన్నా! అని విన్నవారు గుండెలు బాదుకుంటున్నారు.

అయితే ఇదంతా కట్టుకథ అని లేపాక్షి ఆలయం మీద అనేక పరిశోధనలు చేసి అనేక శాసన, ఇతర చారిత్రిక ఆధారాలతో తెలుగులో, ఇంగ్లీషులో పుస్తకాలను ప్రచురించిన హిస్టరీ ప్రొఫెసర్ వి. కామేశ్వర రావు నిరూపించారు.

“రాయలసీమలో చాలా దేవాలయాలకు విరుపణ్ణ చేసిన దానశాసనాలు దొరికాయి. లేపాక్షి ఆలయానికి సాళువ నరసింహరాయలు, అచ్యుతదేవరాయలు, విరుపణ్ణ అనేక దానాలు చేసినట్లు శాసనాల్లో స్పష్టమైన ఆధారాలున్నాయి. అప్పటికే ఉన్న గుడిని విరుపణ్ణ విస్తృతపరిచాడు. ఆ రోజుల్లో లేపాక్షి వాణిజ్య నగరం. అందుకే 1530 ప్రాంతాల శాసనాల్లో “లేపాక్షి నగరం” అన్న మాట అనేకచోట్ల ఉంది.

విరుపణ్ణ అచ్యుతదేవరాయల ఆగ్రహానికి గురై ఉంటే…వారిద్దరూ కలిసి, విడి విడిగా…లేపాక్షికి అగ్రహారాలు, భూములు దానాలు చేసినట్లు, సుంకాలపై వచ్చే సొమ్ములో కూడా కొంతభాగాన్ని ఆలయానికి దానంగా ఇచ్చినట్లు ఈ ఆలయంలో, ఇతర చోట్ల శాసనాల్లో ఎందుకుంటుంది? రాజు శిక్షించిన ఉద్యోగిని శాసనాల్లో గొప్పగా ఎందుకు కీర్తిస్తారు? అచ్యుతదేవరాయల కాలంలో చాలా యుద్ధాలు జరిగాయి. విజయనగర సామ్రాజ్య ఆర్థిక పరిస్థితి దెబ్బతిని…కల్యాణమండప నిర్మాణం ఆగిపోయింది” అన్నది కామేశ్వర రావు గారి వివరణ.

ఆ తరువాత విజయనగరం వెన్నెముక విరిగిపోయింది. ఇక విజయనగరం తల ఎత్తుకుని నిలబడలేదు. లేపాక్షి ఆలయంలో కల్యాణమండపం కూడా లేచి నిలబడలేదు.

లేపాక్షి మీద ప్రభుత్వం తరపున అనితరసాధ్యమైన పరిశోధన చేసి చరిత్రను రాసి పెట్టిన ప్రఖ్యాత పురావస్తు నిపుణుడు, చారిత్రిక రచయిత ఆమంచర్ల గోపాలరావు (Lepakshi, A Publication of the Andhra Pradesh Lalit Kala Akademi, 1969) నాట్య మండపాన్ని అనేక కోణాల్లో లోతుగా విశ్లేషిస్తూ అన్న మాట-

38 స్తంభాల్లో శివపార్వతుల కల్యాణ ఘట్టం; 42 స్తంభాల్లో లతా మండపం ఒకే పైకప్పు కిందికి వచ్చేలా నిర్మించాలని అనుకున్నారు. లతా మండపంలో ఒక్కో స్తంభానికి నాలుగు వైపులా నాలుగు రకాల లతల చొప్పున 42 స్తంభాల్లో 168 డిజైన్లున్నాయి. శివపార్వతుల కల్యాణ వేదిక ఈ శిలా ఉద్యానవనం పక్కన ఉన్నట్లుగా శిల్పి తనదైన పద్ధతిలో చెప్పదలుచుకున్నాడు”.

ఈ లతలే లేపాక్షి డిజైన్లుగా ప్రపంచ ప్రసిద్ధి అయ్యాయి.

“గిరి బాలతో తనకు కల్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు…” అని సిరివెన్నెలగారన్నట్లు…పెళ్లి చేద్దామని మన్మథుడు తనమీద పూలబాణం వేసినందుకు బూడిదచేసి పారేశాడు. విరుపణ్ణ న భూతో న భవిష్యతి అన్నట్లు అంగరంగ వైభవంగా రాతి పెళ్లి పందిరి వేయబోతే…చెడిపేసుకున్నవాడిని ఏమంటాం!
శివుడి ఆజ్ఞ లేనిది చీమయినా కుట్టదు అనుకోవాలి- అంతే!

లతలున్న స్తంభాల మీద పైకప్పు రాతి దూలాలు కూడా పడ్డాయి. అక్కడితో ఆగిపోయింది.

విరుపణ్ణ కంటితో కల్యాణ మండపం పూర్తయిన రమణీయ దృశ్యాన్ని ఊహించుకుని…పొంగిపోవడం తప్ప మనం చేయగలిగింది లేదు.

“శంకరుని శర్వాణి జలదసుందరవేణి ప్రకృతిగా మారి పరమేశ్వరుడిలో కలిసిపోయింది”
అని శివతాండవంలో సరస్వతీపుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు దర్శించారు. మనల్ను దర్శింపజేశారు. అలా అసంపూర్తిగా ఆగిన కల్యాణమండపంలో లతామండపం చెట్లు, లతలు, పూలు, కాయలు, పళ్లు, జంతువులు, పంచ భూతాలు, సమస్త ప్రకృతి శివుడిలో కలిసిపోయినట్లుంది.

ఇది ఇలలో శిలలో శివపార్వతుల కమనీయ కల్యాణ వేదిక.
పైకప్పు పడకపోయినా…ఆకాశమే కప్పుగా లోకకల్యాణం ప్రతిఫలించే రమణీయ శిలా మాలిక.

రేపు:-అదిగో లేపాక్షి-8
“లేపాక్షి బసవయ్య లేచి రావయ్య!”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్