Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఆంధ్రప్రదేశ్ లోని మూడు చారిత్రక కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శ స్మారకాలుగా గుర్తించింది.  నాగార్జునకొండ, శాలిహుండం, లేపాక్షి ఆలయాలకు ఈ గుర్తింపు దక్కింది.

వారసత్వ కట్టడాల దత్తత పథకంలో భాగంగా ఏపీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. ఈమేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శ స్మారకాల జాబితాలో చేర్చినట్టు తెలిపారు. ఈ ఆదర్శ స్మారకాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వీటిలో వై-ఫై ఇంటర్నెట్ సౌకర్యం, ఎగ్జిబిషన్, లైటింగ్ ప్రదర్శనలు, కెఫే వంటి ఏర్పాట్లు చేస్తామని కిషన్ రెడ్డి వివరించారు. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో కడప జిల్లా గండికోటకు స్థానం కల్పించినట్టు వెల్లడించారు. ఈనేపథ్యంలో లేపాక్షి ఆలయం గురించి విశేషాలివి.

రాళ్లు కళ్లు విప్పితే లేపాక్షి… రాళ్లు రాగాలు పలికితే లేపాక్షి… రాళ్లు తీగ సాగితే లేపాక్షి… రాళ్లు హొయలు పోతే లేపాక్షి… విజయనగర రాజ్యంలో శిల్పులు ఉలితో రాళ్లకు చక్కిలిగింతలు పెడుతూ ప్రాణం పోస్తారని  వర్ణించారు కవులు. ఆలయాలపై అలా ప్రాణం పోసుకున్న శిల్పాలు, చిత్రాలు దాదాపు ఐదు శతాబ్దాలుగా లేపాక్షి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఒక చారిత్రక పట్టణంగా భాసిల్లుతోంది. లేపాక్షి హిందూపురం నుంచి 15 కి.మీ, బెంగళూరు నుంచి 120 కి.మీ దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశ మార్గంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. దీనినే లేపాక్షి బసవయ్య అంటారు. లేపాక్షి బసవయ్య శిల్పం మెడలో పూసల హారాలు, గంటలు, రిక్కించిన చెవులు, లేవబోతూ కాళ్లను సరిచేసుకుంటున్న భంగిమ, మెడలో గండభేరుండ హారం ఉన్న ఆ నంది చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. అందుకే అడవి బాపిరాజు పరవశించిపోయి ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య’ అంటూ తన మాటల సరాన్ని ఈ నంది మెడలో వేశాడు. ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం (లేపాక్షి ఆలయం) ఉంది.

శివకేశవులు ఒక్కరే
ఆధ్యాత్మికంగా లేపాక్షి ఆలయం ప్రత్యేకతలు అనేకం. కొన్ని శతాబ్దాలుగా వీరశైవం-మహా వైష్ణవం పేరిట రెండుగా చీలిపోయిన సమాజాన్ని విజయనగర రాజులు కలపదలచుకున్నారు. శివుడికి విష్ణువుకు మధ్య విభేదాలు లేవని నిరూపిస్తూ ఈ ఆలయంలో శివకేశవులను ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. మూలవిరాట్టు వీరభద్రస్వామి అయితే, గుడిలోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. ఆలయం బయటి ప్రాకారాల్లో గణపతి, నాగేంద్రుడి పెద్ద రాతి విగ్రహాలు చూడ ముచ్చట గొలుపుతుంటాయి.

చెలువములన్నీ చిత్రరచనలే
అంతంత రాతిపలకలు, స్తంభాలు, పైకప్పుల రాతిదూలాలు, పైకప్పుల మధ్య శతపత్ర దళ శిలా చిత్రణలు ఎలా చేశారో ఊహిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. లేపాక్షి ఆలయం పైకప్పుల లోపలివైపు వేసిన వర్ణచిత్రాలను చూడటానికి రెండుకళ్లు చాలవు. తలపెకైత్తి పైకప్పు వైపు చూస్తూ నడుస్తుంటే ఎన్నెన్ని పౌరాణిక గాథలో! స్త్రీల తలకొప్పులు, జడకుచ్చుల నుంచి… పెద్ద పెద్ద రథాల వరకు ఈ చిత్రాల్లో ఎక్కడా ఏ చిన్న అంశం వదలకుండా నాటి ఆచారాలు, వేషాలను చిత్రకారులు ప్రతిబింబించారు. గోడమీద నిల్చుని బొమ్మలు వేయడమే కష్టం. అలాంటిది అంత ఎత్తులో వ్యతిరేక దిశలో కొప్పును వర్ణశోభితం చేయడమంటే మాటలు కాదు. ఈ చిత్రాల్లోని డిజైన్‌లే నేటికీ కలంకారీ కళలో వాడుకలో ఉన్నాయి.

మాట్లాడే శిల్పం – వేలాడే స్తంభం
గర్భగుడి గోడలపై పురాణగాథల శిల్పాలు, సభామండపం, నాట్యమండపం, ముఖమండపం, అసంపూర్తిగా ఉండిపోయిన శివపార్వతుల కళ్యాణమండపం… లేపాక్షి ఆలయంలో ఎక్కడ చూసినా శిల్పాలు అణువణువునా మనతో ఊసులాడుతూనే ఉంటాయి. ఇక్కడ కనిపించే తీగలు, ఉయ్యాల కొక్కేలు, అన్నం కలపడానికి పళ్లేలు, రంగులు కలపడానికి గిన్నెలు, వంటశాలలో అల్మరాలు… అన్నీ రాతితో నిర్మించినవే. గర్భగుడి ముందు మండపంలో నేలను తాకీ తాకనట్లుండే వేలాడే స్తంభం ఈ గుడికి ప్రత్యేక ఆకర్షణ. నిజానికి చాలాకాలంగా అది పూర్తిగా వేలాడుతుంటే స్వాతంత్య్రానికి పూర్వం ఒక తుంటరి ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరిపాడని, ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలందని ఒక కథనం.

లే… పక్షీ!
సీతను అపహరించుకుపోతున్న రావణుడిని జటాయువు అడ్డుకోవడానికి విఫలయత్నం చేసింది. రెక్కలు తెగిన జటాయువు లేపాక్షికి దగ్గరలోని బింగిపల్లి గ్రామ సమీపాన పడిపోయింది. సీతాన్వేషణలో వచ్చిన రాముడు జటాయువును ‘లే… పక్షీ..!’ అనడంతో ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరొచ్చిందని ప్రతీతి. మరో కథనం ప్రకారం… అచ్యుతరాయలు వద్ద కోశాధికారిగా పనిచేసే విరూపణ్ణ ఈ ఆలయాన్ని రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో నిర్మించాడు. కళ్యాణ మంటపం నిర్మాణ సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేశారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్ష ను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసి కళ్యాణమంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపై ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు. అలా లోప-అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడ కూర్మశైలం అనే కొండ ఉండేది. ఈ కొండపై విరూపణ్ణ ఏడుప్రాకారాలతో ఆలయాన్ని కట్టించాడు. అయితే, ఇప్పుడు మూడు ప్రాకారాలు మాత్రమే మిగిలాయి. మిగిలినవి కాలగర్భంలో కలసిపోయాయి. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనాలు చెక్కారు. వీటి ద్వారా ఈ దేవాలయ పోషణకు భూదానం చేసిన దాతల వివరాలు తెలుస్తాయి. పై కప్పుల మీద లేపనంతో వేసిన చిత్రాలన్నింటిలో కళ్లకే ప్రాధాన్యమివ్వడంతో లేపనం – అక్షి, లేపాక్షి అయి ఉంటుందన్న వాదన కూడా ఉంది. అయితే జటాయువు పడ్డ ప్రాంతం ఇక్కడ దర్శనీయ స్థలం కాబట్టి ఎక్కువ మంది జటాయువుతో ముడిపడ్డ లేపాక్షి వాదననే నమ్ముతున్నారు.

వసతులు పెంచాలి
లేపాక్షిలో సందర్శకులకు సరైన వసతుల్లేవు. టూరిజం శాఖ వారి హరిత రిసార్ట్ ఉంది. కాని ఉన్న గదులు పర్యాటకులకు  చాలడం లేదు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులకు ఇంగ్లిషు, హిందీ ఇతర భాషల్లో ఇక్కడి విశేషాలను చెప్పేందుకు గైడ్లు ఎవరూ లేరు. ఆలయం, ఊరి కష్టాలను చూసి చలించిన కొంత మంది స్థానికులు ‘సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్’ పేరిట ఒక సంఘంగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వసతులు పెంచితే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులతో లేపాక్షి కళకళలాడుతుందన్నది వీరి నమ్మకం.

ఎలా వెళ్లాలంటే…
దగ్గర్లోని హిందూపురంలో రైల్వే స్టేషన్ ఉంది. దగ్గరి ఎయిర్‌పోర్ట్ బెంగళూరు. లేపాక్షి చుట్టు పక్కల పుట్టపర్తి, కనుమ నరసింహస్వామి, నందిహిల్స్, విదురాశ్వత్థం, ఘాటి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయి.

(లేపాక్షి ఉత్సవాల సందర్భంగా 2016లో సాక్షి దినపత్రికలో ప్రచురితమయిన వ్యాసమిది)

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com