దేశంలో తొట్టతొలి సారి లిథియం నిక్షేపాలను గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఈవీ బ్యాటరీల తయారీలో లిథియం మూలకం కీలకమైనదన్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో ఉన్న సలాల్ హైమనా ప్రాంతంలో ఆ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొన్నది. లిథియం, బంగారంతో పాటు 51 ఖనిజ నిక్షేపాల సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది.
బంగారంతో పాటు పొటాషియం, మోలిబ్డీనియం, ఇంకా ఇతర బేస్ మూలకాలకు చెందిన నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు. కశ్మీర్‌తో పాటు ఏపీ, చత్తీస్‌ఘడ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు గనులశాఖ తెలిపింది.
బొగ్గు, లిగ్నైట్‌కు చెందిన నిక్షేపాల 17 నివేదికలను కూడా కేంద్రానికి సమర్పించారు. 7897 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు బొగ్గు శాఖకు తెలియజేశారు.