Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశకునం చెప్పిన బ్రిటన్ బల్లి...

శకునం చెప్పిన బ్రిటన్ బల్లి…

Gone for 45 days:
“బ్రిటన్లో నా కుమారుడు-
నలుగురు చాన్సిలర్లు,
ముగ్గురు హోం సెక్రటరీలు,
ఒక రాణి,
ఒక రాజు,
ఇద్దరు ప్రధానమంత్రుల కాలంలో ఉన్నాడు.

ఇంతకూ వాడి వయసెంత అనుకున్నారు?…
…నాలుగు నెలలు”

-ఒక తండ్రి

“బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ రేపో మాపో సీటు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కానీ ఆమె ముద్ర బ్రిటన్ లో ఎప్పటికీ చెరిగిపోదు.

ట్రస్-
1. రాణిని సమాధి చేశారు.
2. బ్రిటన్ నగదు పౌండ్ ను సమాధి చేశారు.
3. దేశాన్ని సమాధి చేశారు.
4. ఛాన్సిలర్ ను లేపేశారు.
5. తన సొంత కన్సర్వేటివ్ పార్టీని భూస్థాపితం చేశారు.

…ఇవన్నీ…ఒక్క నెలలోనే! ఇంకెవరికయినా ఇంకెప్పుడయినా ఇలా కలలో అయినా సాధ్యమవుతుందా?”

విశ్వ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బ్రిటన్ పౌరుల జోకుల్లో మచ్చుకు ఇవి రెండు.

మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్ ను ఎంత కాదన్నా బ్రిటీషు వారు రెండు శతాబ్దాలు పాలించారు. ఆ ప్రభావం ఇంకో వెయ్యేళ్ళయినా భారత్ మీద అలాగే ఉండేలా మన మెదళ్ల నట్లు అన్నీ బిగించి వెళ్లారు. కాబట్టి బ్రిటన్లో వర్షం పడితే రాజస్థాన్ బండలు పగిలే ఎండల నేలకు జలుబు చేస్తుంది.

ఒక పక్క ప్రజాస్వామ్యంలో జనవాణిని గౌరవించి అలిఖిత సంప్రదాయాలకు, విలువలకు కట్టుబడి…హుందాగా వ్యవహరించే బ్రిటన్ సమాజం…

మరోపక్క అంతకంటే ఎక్కువగా రాచరికాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగడం వైచిత్రి. చింత చచ్చినా చావని పులుపులా…ప్రజస్వామ్యం చింత ఎంత ఎదిగినా...బ్రిటన్ సమాజంలో రాచరికం పులుపు అలాగే మిగిలి ఉంటుంది.

అసంతృప్తికరమయిన పన్నుల విధానం, దిశ దశ లేని మధ్యంతర మినీ బడ్జెట్, పౌండ్ పతనం, ఆర్థిక రంగ అయోమయం, సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధం కావడం…ఇలా ట్రస్ రాజీనామాకు- కర్ణుడి చావులా సవాలక్ష కారణాలు. వెరసి బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ- 45 రోజులు ప్రధానిగా ఉన్న వ్యక్తిగా ట్రస్ చరిత్రలో కలిసిపోనున్నారు.

యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వచ్చిన బ్రెగ్జిట్ గొడవలు, కోవిడ్ తరువాత ఆర్ధిక పతనావస్థ బ్రిటన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ లోపు రాజకీయ అస్థిరత పుండు మీద కారంలా తయారయ్యింది.

మళ్లీ మన రుషి సునాక్ కు అవకాశాలు మెరుగవుతాయా? లేదా? అని మన మీడియా వార్తలను వండి వారుస్తోంది.

ప్రస్తుతం –
లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్…ఫాలింగ్ డౌన్ అని థేమ్స్ నది వెంబడి మొత్తం బ్రిటన్ వాసులు దేశం గ్రేట్ పరువు తలచుకుని తలచుకుని సిగ్గుతో తలవంచుకుని బృంద గానం చేసుకుంటూ ఉండిపోవాలి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సోషల్ మీడియా పైత్యం

Also Read :

ఒక కమల, ఒక రుషి

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్