Wednesday, June 26, 2024
HomeTrending Newsస్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగియటంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి సారించింది. జూన్‌ 4న లెక్కింపు పూర్తి కాగానే స్థానికి సమరం తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్ని కలు ఉంటాయని సూత్రప్రాయంగా సీఎం రేవంత్ రెడ్డి తెలపడంతో సందడి నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియగా.. 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వీటి ఎన్నికల నిర్వహణకు బ్రేక్‌ పడింది. మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై పల్లెల్లో సందడి మొదలైంది.

గ్రామపంచాయతీల ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. సర్పంచులను నేరుగా ఎన్నుకోనుండగా, ఉపసర్పంచ్‌ను పరోక్ష పద్ధతిన ఎన్నుకుంటారు. వార్డు సభ్యులు, సర్పంచ్‌ ఎన్నికల కోసం ప్రతీ వార్డుకు ఒక పోలింగ్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తారు. సర్పంచ్‌, వార్డు సభ్యుడికి వేర్వేరుగా తెలుపు, గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్లను ముద్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులుండవు. ముందుగానే ముగ్గురు, నలుగురు పేర్లతో కూడిన నమూనా బ్యాలెట్‌ పేపర్లను మూడు, నాలుగు విధాలుగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను గతంలో మూడు దశల్లో నిర్వహించారు. మొదట సర్పంచ్‌, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియగా, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వరకు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 5 వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. ఈసారి మూడు విభాగాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

గత ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్‌ కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రెండు నెలలు పట్టే అవకాశముంది. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సమరంలో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయమై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉందని.. త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే లబ్ది పొందవచ్చని అధికార పార్టీలో కొందరు నేతలు సిఎంకు వివరిస్తున్నారు. ఆలస్యం అయితే సంక్షేమ పథకాల అమలు మీద నిలదీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణపై అధికార పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్