రాష్ట్రంలో వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైందని, గత నాలుగేళ్లుగా నిర్బంధాలు, బెదిరింపులు, భూకబ్జాలు నిత్యకృత్యంగా మారాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారని, తాము అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేసి ప్రజలను, టిడిపి కార్యకర్తలను వేధించిన పోలీసు అధికారులకు ఉద్వాసన పలుకుతామని హెచ్చరించారు.
యువ గళం పాదయాత్రలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో లోకేష్ పర్యటిస్తున్నారు. కె.మార్కాపురం గ్రామస్తులు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. ఆ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, పంచాయతీల నిధులు రూ.8,600కోట్లను ప్రభుత్వం దారిమళ్లించిందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ఇంటింటికీ తాగునీటి కుళాయి ఇస్తామని హామీ ఇచ్చారు.
అడ్డగోలుగా పెంచిన పాఠశాల, కళాశాల ఫీజులను క్రమబద్దీకరించి, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపై ఉక్కుపాదం మోపుతామని…సామాన్యుడికి ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిర్మాణరంగానికి పూర్వవైభవం తెస్తామని భరోసా ఇచ్చారు.