సిద్ధమా అని ప్రజలను అడుగుతున్న సిఎం జగన్ దేనికి సిద్ధమని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగసభలో ప్రసంగిస్తూ తమ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ కాపిటల్ అఫ్ ఇండియా గా తయారు చేస్తే జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్ గా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రానికి ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని, అమ్మ ప్రేమకు కండీషన్స్ ఉండవని… ఉత్తరాంధ్ర ప్రేమకు కూడా కండీషన్స్ ఉండవని… ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని లోకేష్ పేర్కొన్నారు. అలాంటి ఈ ప్రాంతంలో శంఖారావం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
జగన్ ఈ మధ్య కొత్త నాటకం మొదలు పెట్టారని, నాలుగేళ్ళుగా డీఎస్సీ అనే పదమే వారినోటి వెంట రాలేదని, ఎన్నికలకు నెలరోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చారని, మోసానికి, దగా-కుట్రకు ఫ్యాంటు-షార్ట్ వేస్తె అది జగన్ మోహన్ రెడ్డి అని అభివర్ణించారు. 23 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని 18 వేలకు తగ్గించారని, ఆ తరువాత 117జీవో తీసుకు వచ్చి స్కూళ్ళు రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించారన్నారు. యువతలో యువ గళం మొదలైందని అందుకే 6 వేల పోస్టులు ఇస్తామని చెబుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, బాబు పరిపాలనలో లక్షా 70 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష రూపాయల ఖరీదైన చెప్పులు, వెయ్యి రూపాయల ఖారీడైన వాటర్ బాటిల్ లో నీళ్ళు తాగే సిఎం జగన్ పేదవాడు ఎలా అవుతాడని, ఆయనకు పేదవారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించి తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన అధికారులను, వైసీపీ కార్యకర్తలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి హెచ్చరించారు. జ్యుడిషియల్ విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తాము వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటి వరకూ నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.3 వేలు నిరుద్యోగ భ్రుతి అందిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి సూపర్ సిక్స్ ప్రకటించారని, వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.