Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపుస్తక ప్రదర్శన

పుస్తక ప్రదర్శన

హైదరాబాద్ లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమయ్యింది. నేను ఇంకా కొనాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. అయితే- ఇదివరకు ఇలాగే కొని…చదవని కొన్ని పుస్తకాలు నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి. దాంతో ఈమధ్య పుస్తకాలు కొనడం బాగా తగ్గించాను. నా ఆఫీసులో ఒక గది నిండా పుస్తకాలే. ఉన్నవాటికి తోడు మా నాన్న పోతూ…పోతూ…నాకు వారసత్వ ఆస్తిగా ఇచ్చినవి, నా మీద అభిమానంతో పుట్టపర్తి నారాయణాచార్యుల వారి కూతురు నాగపద్మిని లాంటి పెద్దలు బహుమానంగా పంపుతున్నవి...అలా అలా పేరుకుపోయాయి.

పదవీ విరమణ తరువాత మా నాన్న తిరుపతిలో స్థిరపడ్డారు. ఆయన తుదిశ్వాస వదిలాక…అరవై ఏళ్లపాటు ఆయన కంటికి రెప్పలా కాపాడుకున్న అయిదు వేల పుస్తకాల్లో మూడు వేల పుస్తకాలను ఆయన చదువుకున్న శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి బహుమతిగా, గుర్తుగా ఇచ్చాను. కొన్ని నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు నా దగ్గరున్న లైబ్రరీలో ఎనభై శాతం పుస్తకాలు మా నాన్నవి. కొన్ని మా తాతవి.

నా దగ్గరున్న వెయ్యికి పైగా పుస్తకాల్లో ఈ ముప్పయ్యేళ్లల్లో మహా అయితే ఒక మూడు వందల పుస్తకాలు మాత్రమే పూర్తిగా చదివి ఉంటానేమో! మిగతావి రెఫెరెన్సులుగా అప్పుడప్పుడు తెరిచేవి. ఒక పేజీ, ఒక లైను మాత్రమే చదివేవి. జీవితకాలంలో చదివి తీరాలనుకున్న పుస్తకాల్లో పాతికశాతం కూడా పూర్తి కాలేదు. ప్రస్తుత వయసును దృష్టిలో పెట్టుకుని లెక్కగడితే…నా ఇతరేతర వ్యాపకాల వల్ల నా దగ్గర అల్మారాల్లో ఉన్నవన్నీ పూర్తీ చదవగలననే నమ్మకమూ లేదు. పూర్తీ చేయాలన్న పట్టుదలా లేదు.

ఆ పుస్తకాల్లో ఏముందో చూడాల్సిన పనిలేకుండా అందులో సారాన్ని వంటపట్టించినవారు ఒకరు- మా నాన్న చెంచు సుబ్బయ్య. రెండవ వ్యక్తి- నాకు జర్నలిజంలో తెలుగు పాఠాలు చెప్పిన డి. చంద్రశేఖర్ రెడ్డి సార్. అలాంటి నడిచే గ్రంథాలయాలుంటే పుస్తకాలతో పనిపడని సంగతుల గురించి ఈ చర్చ.

మొదట్లో నేను జర్నలిస్టుగా మా నాన్నకంటే గొప్ప రచయితను, కవిని, విమర్శకుడిని, చదువరిని- అని అనుకునేవాడిని. కొన్నేళ్లు గడిచేసరికి నేను రాసే ఒక్కో వాక్యంలో ఎన్నెన్ని తప్పులున్నాయో మా నాన్న చెప్పే కొద్దీ…నా భ్రమలన్నీ తొలగిపోయాయి. నేను సగటు రచయిత అనికూడా చెప్పుకోవడానికి వీల్లేదని మా నాన్న నాచేతే చెప్పించారు. అడిగితేనే చెప్పడం ఆయన పద్ధతి. ఒక్క అక్షరం గురించి గంటలు గంటలు ఆయన చెబుతుంటే అలా వింటూ ఉండేవాడిని. ఒక్కో సందర్భానికి తెలుగులో, సంస్కృతంలో లెక్కలేనన్ని ఉదాహరణ పద్యాలు, శ్లోకాలు తడుముకోకుండా చెప్పేవారు. చివర కొసమెరుపుగా ఈ పద్యం ఉన్న పుస్తకం నీ దగ్గర ఉంది. అందులో 80-84 పేజీల్లో ఈ ఘట్టం ఉంటుంది. చదువుకో అని ఫోన్ పెట్టేసేవారు. ఆ పుస్తకం నా ఎదురుగా షెల్ఫ్ లోనే ఉంటుంది. కానీ…నాదగ్గర ఉన్న విషయం నాకు గుర్తుండి చావదు. ఇన్నిన్ని వ్యాకరణ సూత్రాలు, పద్యాలు, శ్లోకాలు నోటికి ఎలా వస్తాయి? అని ఎప్పుడూ అడిగేవాడిని. నన్ను చూసే నువ్విలా నోరెళ్లబెడితే…ఇక గౌరిపెద్ది రామసుబ్బ శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులను చూస్తే ఏమనేవాడివో? అని వారి అనన్యసామాన్యమైన జ్ఞాపకశక్తిని, పద్యాలు చెప్పే వేగాన్ని నెమరువేసుకునేవారు. పుస్తకం ఉండడం; చదవడం; అర్థం చేసుకోవడం; అన్వయించుకోవడం వేరు వేరు ప్రక్రియలురా! అని నేను ఏ దశలో ఉన్నానో నాకు క్లారిటీ ఇచ్చేవారు.

మా నాన్న నుండి నాకు అందిన ప్రతి పుస్తకం మీద ఆయన సంతకం ఉంది. ముద్రణలో అక్షర దోషాలను ఆయన దిద్దిన సవరణలున్నాయి. పెన్సిల్, పెన్ను అండర్ లైన్ గీతలున్నాయి. అంటే అవన్నీ ఆయన చదివినవి. నా దగ్గర కేవలం ఉన్నవి.

2023 సంవత్సరంలో హైదరాబాద్, విజయవాడల్లో దాదాపు పాతిక పుస్తకాలు కొని ఉంటాను. కానీ సంవత్సరమంతా పూర్తీ చదవగలిగినవి మూడు గ్రంథాలే.
1 . కంకంటి పాపారాజు ఉత్తర రామాయణం– ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డా. అద్దంకి శ్రీనివాస్ వ్యాఖ్యానం- మూడు భాగాలు
2 . కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం– ఆచార్య బేతవోలు రామబ్రహ్మం వ్యాఖ్యానం
3 . సాహితీ దృక్పథం, కవి హృదయం, సాహిత్య నేపథ్యాల మీద ఆర్. ఎస్. సుదర్శనం వ్యాసాల సంకలనం- రెండు భాగాలు.

కాళిదాసు రఘువంశ మహా కావ్యం ప్రతిపదార్థంతో చదవడం మొదలుపెట్టి రెండేళ్లయింది. ఇంకా సగం కూడా కాలేదు. నేను రాసే వ్యాసాల ధారావాహికల కోసం ఇదివరకు చదివినవాటినే ఇంకా లోతుగా చదవాల్సి ఉంటుంది.

హైదరాబాద్ ఆంధ్రసారస్వత పరిషత్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, పదవీ విరమణ తరువాత ప్రస్తుతం ఎమెస్కో పుస్తక ప్రచురణ సంస్థ ఎడిటర్ గా పనిచేస్తున్న దుర్గెంపూడి చంద్రశేఖర్ రెడ్డి సార్ నాకు 1992లో జర్నలిజంలో తెలుగు పాఠాలు చెప్పిన గురువు. ముప్పయ్యేళ్లుగా ఆయన నాకు తెలుగు పాఠాలు చెబుతూనే ఉన్నారు. భాషాశాస్త్రం, భాషోత్పత్తి శాస్త్రం, మాటల వ్యుత్పత్తి మీద సార్ చెప్పిన విషయాలే నారాతల నిండా ఉంటాయి. భాషను లెక్కల్లా, సైన్సులా ఆయన చెప్పే పద్ధతిని వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నేనేదన్నా ప్రశ్న అడిగితే…వెంటనే ఫలానా పుస్తకం చదివావా? అని అడుగుతారు. అంటే నా ప్రశ్నకు మూలాన్ని కూడా చిటికెలో పట్టుకోవాలంటే ఆయన ఎన్నెన్ని చదివి ఉండాలి? అని ప్రతిసారీ ఆశ్చర్యపోతుంటాను. సార్! ఫలానాది ఇలా అనుకుని తప్పు రాశాను… అని అంటే అలా అనుకోవడానికి నేను ఏ పుస్తకం నుండి దాన్ని తీసుకున్నానో చెప్పి…ఫలానాది చదువు అని చెప్తారు. వ్యాకరణం, భాషాపరిణామ సిద్ధాంతాల్లో కొన్ని వందల వ్యాసాలను కోట్ చేస్తూ అరటి పండు ఒలిచి పెట్టినట్లు చెబుతారు. తన సొంత లైబ్రరీలో ఉన్న ఆ వ్యాసాలు, పుస్తకాలను పంపుతారు. నాదగ్గరున్న రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ సంగీత, సాహిత్య వ్యాసాలు, ఆంధ్ర దశరూపకం లాంటి అరుదైన పుస్తకాలు సార్ ఇచ్చినవే.

సార్! మీలాంటివారి తరువాత మాలాంటివారికి ఏ పుస్తకంలో ఏముందో? ఏ సందేహానికి ఏ పుస్తకం వెతకాలో…చెప్పేవారెవరు?
అని అడిగితే…
“గూగులమ్మ తెలుగు ఈత చెట్టును “స్విమ్మింగ్ ట్రీ” అని ఇంగ్లీషులోకి అనువధించి నాలుగు నిలువుల లోతులో ఈత కొట్టిస్తుంటే…గురువులను అడిగేవాడెవడు మధూ!”
అని తేల్చిపారేశారు.

నాన్నా! నువ్విచ్చిన ప్రతి పుస్తకంలో అండర్ లైన్లు, పెన్ను, పెన్సిల్ తో కొట్టివేతలు, పక్కన నీ సవరణలు…అంతా గజిబిజిగా ఉంటుంది అంటే…
“పుస్తక ప్రదర్శన” కాదు కదా! చదివితే అంతే. తప్పుంటే సరిదిద్దుకోవాలి” అనేవారు. అప్పటినుండి “పుస్తక ప్రదర్శన” అన్న మాట వింటేనే నాకు వణుకు!

“పుస్తకం చేతిలో ఉంటే హస్తభూషణం; చదివితే మస్తకభూషణం”
అనేవారు మా నాన్న. నాదగ్గరున్న అనేక హస్తభూషణాలు మస్తకభూషణాలు ఎప్పుడవుతాయో!
అయినా…కాకున్నా…అవి మస్తకభూషణాలైన పెద్దలనుండీ విన్నదే ఈ జన్మకు భాగ్యం అనుకుని తృప్తిపడాలి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్