Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశ్రీకృష్ణ కర్ణామృతం-4

శ్రీకృష్ణ కర్ణామృతం-4

కంసుడు పిలుస్తున్నాడని శ్రీకృష్ణుడిని తీసుకెళ్లడానికి అక్రూరుడు రథం తీసుకుని వచ్చిన విషయం తెలిసి గోపికలన్న మాట-
“ఇతడి పేరు అక్రూరుడా?
కాదు.
కృష్ణుడిని మానుండి దూరం చేసే ఇతను అక్షరాలా క్రూరుడే”

నేను వచ్చేశాక వ్రేపల్లె ఎలా ఉందో! ఒకసారి చూసి రా! అని ఉద్ధవుడిని కృష్ణుడు వ్రేపల్లెకు పంపుతాడు. వ్రేపల్లెలో గోపికల కృష్ణనామ స్మరణ చెవులారా విని, కనులారా వారి కృష్ణ పరవశం చూసి ఉద్ధవుడు పులకింతతో నేలమీద పడి దొర్లుతాడు. కృష్ణుడు కనిపించట్లేదని మా బాధలో మేముంటే ఇతనేమిటి ఏవేవో ప్రశ్నలడిగి…ఇలా ప్రవర్తిస్తున్నాడు? అని అనుకుంటారు గోపికలు. మీరు కృష్ణుడితో కలిసి తిరిగిన, నాట్యం చేసిన ఈ నేల ధూళిని ఒంటికి అద్దుకోవడానికి దొర్లుతున్నానంటాడు ఉద్ధవుడు. “కృష్ణుడు మిమ్మల్ను చూసి రమ్మన్నది- మిమ్మల్ను ఓదార్చడానికి కాదు- మిమ్మల్ను చూసి నేర్చుకొమ్మని” అని మైమరపుతో చెప్తాడు.

“కృష్ణ” అన్న మాట వ్యుత్పత్తి అర్థమే ఆకర్షించేవాడు అని. ఆయన ఆకర్షణలో పడనివారెవరు?

లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతంలో పదపదాన పోతపోసిన, రాశిపోసిన కృష్ణుడి అందం మనల్ను కట్టి పడేస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. మళ్లీ మళ్లీ ఆ వేణుగానమే వినాలనిపిస్తుంది. ఆ వెన్నెల్లో…యమున ఒడ్డున ఇసుక తిన్నెల్లో కృష్ణగానామృతం కోసం మనసు పరుగులు పెడుతుంది.

లీలాశుకుడు దర్శించి…మనకు దర్శనం చేయిస్తున్న కృష్ణుడు ఇలా ఉంటాడు.

నెత్తిమీద నెమలి పింఛం. భుజాలవరకు జుట్టు. నుదుటిమీద వంకర్లు తిరిగిన ముంగురులు. కళ్లల్లో కాంతి. పెదవి మీద చిరు నవ్వు. మొహంలో తేజస్సు. అమృతం చిలికినట్లు వేణుగానం. చుట్టూ గోపికలు.

పిల్లనగ్రోవి ఊదుతూ అరమోడ్పు కన్నులతో, ఒక కాలిమీద ఇంకో కాలు త్రిభంగిలో పెట్టి నిలుచున్న కృష్ణుడు. ఆయన వెనుక ఆవు. ఆ వెనుక శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టు. కొమ్మకొమ్మకో పక్షి. వేణుగానానికి పరవశించి పురివిప్పి ఆడుతున్న నెమళ్లు.

యమునానదిలో పద్మవనంలో విహరించే రాజహంసల వీనులవిందైన కంఠధ్వనులతో సమానంగా కృష్ణుడి కాలిగజ్జెలు మోగుతున్నాయి.

ఒంటినిండా అలంకారాలు దిగేసుకుంటే తప్ప కొందరు కంటికి ఆనరు. కృష్ణుడికి ఏ అలంకారాలూ అక్కర్లేదు. జుట్టుమీద నెమలి పింఛం. మెహంమీద రెండు, మూడు బొట్లు పెడితే చాలు…నిండు చంద్రుడు చిన్నబోవాల్సిందే. మన్మథుడు సిగ్గుతో తలదించుకోవాల్సిందే.

ఈ బాల కృష్ణుడు మన్మథుడా! చంద్రబింబమా! నా హృదయానందమా! నా కన్నుల పండుగా! పలుకుల తియ్యదనమా! ముద్దుల మూటా! నా ప్రాణమా!

రేపు:-
కృష్ణ కథలు

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్