అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ-రావణుల మధ్య భీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా మిగిలి, భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఒక దశలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆలోచనలో పడ్డాడు- చెలరేగిపోతున్న రావణుడిని గెలవడం అంత తేలిక కాదేమో అని. ఆ క్షణంలో అగస్త్యుడు ప్రత్యక్షమయ్యాడు. “రామ రామ మహాబాహో !” అంటూ ఆదిత్య హృదయం బోధించి, సూర్యుడిని ప్రార్థించి ఆ బలంతో వెంటనే రావణుడిని సంహరించు – అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. రాముడు అలాగే చేశాడు. అప్పటి నుండి లోకానికి ఆదిత్య హృదయం అందింది.
రోజులు ఏడు.
సూర్యుడి రథం గుర్రాలు ఏడు.
సప్తాశ్వారథమారూఢం…
ఏడు రోజులే ఏడు గుర్రాలుగా;
ఏడు వర్ణాల కిరణాల దారులమీద కోట్ల ఏళ్లుగా అలుపెరుగని రథంమీద ఆగని, ఆగకూడని ప్రయాణం సూర్యుడిది.
విష్ణుసహస్రనామంలో సూర్య చంద్రులు నేత్రాలుగా అని ఉంటుంది. విరాట్ పురుషుడి రెండు కళ్లు – సూర్య చంద్రులు. చెట్లలో పత్రహరిత ప్రాణం పాదుకొల్పడానికి సూర్యుడు కారణం. మన శరీరంలో విటమిన్ డి ఏర్పడి ఎముకలు నిలబడడానికి కారణం సూర్యుడు . నీరు ఆవిరి అయి మేఘం ఏర్పడడానికి కారణం సూర్యుడు. నానా మురికి ఎండి చెత్త తగ్గడానికి కారణం సూర్యుడు. కుళ్ళినవి అలాగే మిగలకుండా వాడిపోయేలా కావడానికి కారణం సూర్యుడు.
హనుమంతుడంతటివాడికి సర్వ శాస్త్రాలు బోధించిన గురువు సూర్యుడు. అపరిమిత శక్తి ప్రదాత. అపరిమిత వేడితో తను రగిలిపోతూ – లోకాలకు వెలుగులు పంచే త్యాగి. అంతులేని వెలుగులు విరజిమ్మే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ.
ప్రత్యక్షంగా మన కంటికి కనపడే ఏకైక దైవం సూర్యనారాయణుడు. సూర్యుడి నడకే మనకు కాలం. సూర్యుడి రాకే పొద్దు పొడుపు. అందులో ఉత్తరాయణం పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భారతంలో భీష్ముడు అంపశయ్యపై ప్రాణాలను ఉగ్గబట్టుకుని నిరీక్షించాడు.
సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. నీళ్లను ఆవిరి చేసి మేఘాలకు చేర్చే కిరణాలు కొన్ని. వేడినిచ్చే కిరణాలు కొన్ని. వెలుగులు పంచే కిరణాలు కొన్ని. శక్తినిచ్చే కిరణాలు కొన్ని. ఆరోగ్యాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. లేత కిరణాలు కొన్ని. ముదురు కిరణాలు కొన్ని. ఎరుపు రంగు కిరణాలు కొన్ని. పసుపు రంగు కిరణాలు కొన్ని. బంగారు రంగు కిరణాలు కొన్ని. నీలపు రంగు కిరణాలు కొన్ని. అతి నీలలోహిత కిరణాలు కొన్ని.
“ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్”
గాయత్రీ మంత్ర రహస్యమే సూర్యుడి కిరణం. సూర్యుడి కిరణమే గాయత్రీ దేవి నివాసం. అంటే వెలుగే దైవం. వెలుగే చైతన్యం. వెలుగే జ్ఞానం. వెలుగే శక్తి. వెలుగే సర్వస్వం.
సూర్యుడు లేకపోతే అంతా చీకటి. చిమ్మ చీకటి.
శ్లోకం:-
“ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.
ధన మిచ్ఛే ద్ధుతాశనః.
జ్ఞానం మహేశ్వరా దిచ్ఛేత్.
మోక్ష మిచ్ఛే జ్జనార్దనః”
అనువాద పద్యం:-
“సూర్యు డారోగ్యమిచ్చును సుజనులార!
సంపదలనగ్ని యొసగును సరసులార!
జ్ఞాన మీశ్వరుడిచ్చును జ్ఞానులార!
మోక్షమిచ్చు జనార్దనుండక్షయముగ”
అని మన రుషుల వాక్కు.
సూర్యుడు లేకపోతే అంతా శూన్యం. పంట లేదు. వంట లేదు. బతుకే లేదు.
వేనవేల కాంతులను పొదివి పట్టుకున్న సంక్రాంతి శుభాకాంక్షలతో…
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు