ప్రేమకు విరోధులు ఎవరు? కులాలు,మతాలు అని చప్పున చెప్పేస్తాం. ఇంకా పేద, ధనిక తేడాలు కూడా చెప్తాం. మరీ మడికట్టుకున్నవారికి దేశాంతర, ఖండాంతర తేడాలు కూడా ఉంటాయి. ఇవేవీ లేకుండా కూడా ప్రేమకథలకు విలన్లు ఉంటారు. ఆ విలన్ పేరే అహం. ఆ పాయింట్ మీద తీసిన సినిమా లవ్ రెడ్డి.
అనగనగా ఒక అమ్మాయి – అబ్బాయి. అబ్బాయికి అమ్మాయంటే ప్రాణం. ఇద్దరిదీ ఒకటే కులం. ఆర్థికంగా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. నేరుగా చెప్పలేకపోయినా అమ్మాయి చుట్టూ తిరుగుతూ అవసరమైన సహాయం చేస్తూ ఉంటాడు. అమ్మాయి చెప్పకపోయినా తనని గాఢంగా ప్రేమిస్తోందని నమ్ముతాడు. తీరా ధైర్యం తెచ్చుకుని అమ్మాయితో చెప్పే సమయానికి నువ్వంటే ఇష్టం లేదు పొమ్మంటుంది. నిజానికి ఆ అమ్మాయికీ అతడంటే ప్రాణం. కానీ చెప్పలేకపోయింది. ఈ కథలో విలన్ అమ్మాయి తండ్రి, అతని అహం. కూతురు ముందే తనకి చెప్పలేదనే కోపం. తన ఎంపికే కూతురు ఇష్టపడాలి గానీ ఆమెకి నచ్చింది ఇవ్వకూడదనే మూర్ఖత్వం. అది కూతురి ప్రాణాలు తీసేంత వరకు వెళ్తుంది. ఫలితంగా రెండు జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతాయి.
‘లవ్ రెడ్డి’ పేరిట అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న సినిమా. ప్రముఖ నటులు లేరు. దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ … ఎవరూ తెలిసిన వాళ్ళు కాదు. కానీ చాలా సహజంగా సున్నితంగా తీసిన సినిమా. రాయలసీమ, కర్ణాటక సరిహద్దుల గ్రామం లో జరిగినట్టుగా చూపారు. ఎక్కడా అతిలేదు. డబల్ మీనింగ్ డైలాగుల్లేవు. వున్నంతవరకు పాటలు కూడా బాగానే ఉన్నాయి. ముగింపు విషాదాంతం అయినా సినిమా న్యాయం అనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలున్నా పట్టించుకోనక్కరలేదు. మిగిలిన సినిమాల్లా రకరకాల యాసలు, తాగుడు, ద్వందార్థాల మాటలు, చౌకబారు హాస్యం, అసభ్యత లేకుండా రాయలసీమ యాస సంభాషణలతో ఫ్రెష్ ఫీల్ ఇచ్చే చిత్రం. చూడదగ్గ సినిమా. దర్శక నిర్మాతలకు అభినందనలు