Sunday, January 26, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅసలైన విజేతలు

అసలైన విజేతలు

సబ్యసాచి ముఖర్జీ… ఫ్యాషన్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించిన కొద్దికాలానికే దేశ విదేశాల్లో పేరు సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూయార్క్, లండన్ , మిలాన్ ‘ఫ్యాషన్ వీక్ ‘లో పాల్గొన్న ఏకైక భారతీయ డిజైనర్ గా చరిత్ర సృష్టించాడు. అతను డిజైన్ చేసిన దుస్తులు ధరించాలని, తమ పెళ్ళిలో ఒక్కటైనా అతని డిజైన్ ఉండాలని దేశంలోని ప్రముఖులు కోరుకుంటారు. లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ లో అరుదైన డిజైన్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి సబ్యసాచి ప్రశంసకు పాత్రులయ్యారు కొందరు అమ్మాయిలు. వారి వీడియో చూసి ఆశ్చర్యపోయి ‘అసలైన విజేతలు వారే ‘ అన్నాడంటే తప్పనిసరిగా వారి గురించి తెలుసు కోవాలి.

ఎరుపు- భారతీయ సంప్రదాయంలో ఈ రంగుకు ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ఏదో ఒక కాలానికో, సందర్భానికో లోబడికాక ఎక్కడైనా ఎప్పుడైనా సమున్నతంగా కనిపిస్తుంది ఎర్రటి రంగు. అందుకే వివాహాల్లో ఎరుపుది ముఖ్యపాత్ర. అదే ఉద్దేశంతో సబ్యసాచి 2023 లో ‘ హెరిటేజ్ బ్రైడల్ కలెక్షన్ ‘ పేరిట అద్భుతమైన పనితనంతో కూడిన వస్త్ర శ్రేణి పరిచయం చేశాడు. ఆ మోడళ్ల వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. ఇదే లక్నోకి చెందిన కొందరు మురికివాడల బాలికల్లో స్ఫూర్తి కలిగించింది. ఆ బాలలకు రకరకాల నైపుణ్యాలున్నాయి. కొందరికి కుట్టడం వచ్చు. మరికొందరికి ఎంబ్రాయిడరీ, వీడియోగ్రఫీ … ఇష్టం. ఎదగాలనే తపన ఉంది.

దాతలు తమకు ఇచ్చే దుస్తులే పెట్టుబడిగా తమ నైపుణ్యం, సృజనాత్మకత జోడించి వారూ బ్రైడల్ కలెక్షన్ రూపొందించారు. అక్కడితో ఆగిపోలేదు. అచ్చం సబ్యసాచి షో మాదిరే వారూ ఫాషన్ షో తమ స్థాయిలో నిర్వహించారు. వీరంతా 12 నుంచి 17 ఏళ్ళ వయసువారే. వీడియోగ్రఫీ కూడా వారిదే. ఇన్నోవేషన్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ వారి కలల సాకారానికి సహాయపడింది. సబ్యసాచి వీడియోతో పాటు ఈ పిల్లలు డిజైన్ చేసి మోడలింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పెట్టగానే అభినందనలు వెల్లువెత్తాయి. స్వయంగా సబ్యసాచి వారిని ‘అసలైన విజేతలు’ అని ట్విట్టర్లో ప్రశంసించగా, అదితిరావు హైదరి, ఇతర సెలెబ్రిటీలు స్పందించారు. వారికేమీ పెద్ద చదువులు లేవు. కానీ ఆసక్తి, తపన ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఇదేమీ గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ ఆ చిన్నారులకు గొప్ప విజయమే. ఈ రోజు మెచ్చుకున్నవారు ముందు ముందు వీరి డిజైన్లు కోరిచేయించుకుంటారేమో! ఏమో ! ఎవరు చెప్పగలరు? ఆర్ధికంగా ఎదిగి ఈ బాలికలు తమదైన బ్రాండ్ దుస్తులు రూపొందించే రోజు కోసం ఎదురుచూద్దాం.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్