Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం"మా"మహా సంగ్రామం!

“మా”మహా సంగ్రామం!

High voltage drama, Arguments, Hugs, talks of peace: MAA elections 2021

వెనకటికి ఒక చెట్టు తొర్రలో ఒక పక్షి గుడ్లు పెట్టింది. గుడ్డు పొర చీల్చుకుని చిట్టి పక్షి బయటికి వచ్చేసరికి పడీ పడనట్లుగా చిరు జల్లు మొదలయ్యింది. చిట్టి పక్షి తల్లితో ఇలా అన్నది.
“నా జీవితంలో ఇలాంటి తుఫాను చూడలేదు”
తల్లి పక్షి నవ్వుకుంది.

ఈ కథ నిజంగా జరిగింది కాకపోవచ్చు. లేక పక్షుల భాష మనుషులకు తెలిసిన కాలంలో నిజంగా జరిగినా జరిగి ఉండవచ్చు. అతిశయోక్తికి, లోకజ్ఞానం లేకుండా చీమ తలకాయను విశ్వమంత పెద్దదిగా ఎవరయినా చెబుతుంటే…వెక్కిరించడానికి ఈ పక్షి తుఫాను కథను చెబుతుంటారు.

ఇదే కథను ఇప్పటి ఒక సందర్భానికి అన్వయించుకుందాం.
జుబ్లీ హిల్స్ ఫిలిం నగర్ చెట్టు తొర్రలో ఒక “మా” ఎన్నిక జరుగుతోంది. మహా అయితే 900 ఓట్లు ఉన్నట్లున్నాయి. దాంట్లో పోలయినవి బహుశా 665 అట.

స్టూడియో గుడ్డు చీల్చుకుని కెమెరాల ముందుకొచ్చిన మీడియా పక్షులు చెప్పిన చిలక పలుకులివి:-

1 . ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల.

2 . పోస్టల్ ఓట్లకు డబ్బు భారీగా చెల్లింపు.

3. ఓట్ల నమోదులో అక్రమాలపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు.

4. పోలింగ్ బూత్ ను పరిశీలించిన అభ్యర్థి.

5 . ఆత్మ సాక్షితో ఓటు వేసిన వట వృక్షం.

6. గెలుపోటములపై రాత్రి పొద్దుపోయేవరకు చర్చోప చర్చలు.

7. ఎన్నికల్లో హింస జరగకుండా కేంద్రబలగాలను షేక్ పేట గుట్టల్లో సిద్ధంగా ఉంచిన నిఘా వర్గాలు.

8. ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలకు కొత్త స్టూడియోలు కట్టిన న్యూస్ ఛానెళ్లు.

9. ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రసారం చేయడానికి వీల్లేదన్న అంతర్జాతీయ ఎన్నికల సంఘం పరిశీలకులు.

10. ఓటరు కార్డు ఉన్నా ఓటు వేయనివ్వనందుకు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన ఓటర్లు.

11. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సుప్రీం కోర్టుతో సంప్రదించి రెండు నెలలుగా తమకు తాము విధించుకున్న ఎన్నికల కోడ్ ను ఎత్తివేసుకున్న మీడియా.

12. మా వార్తలు ముగియడంతో రేపటి నుండి ఏ వార్తలు వేయాలో తెలియక స్టూడియోలను మూసుకున్న ఛానెళ్లు.

కొసమెరుపు:-
చెల్లని ఓట్లు యాభై. దాంతో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ న్యాయస్థానాన్ని సంప్రదించి ఫలితాలను ప్రకటిస్తారో! ఏమో!
మా ఖర్మ ఎలా అఘోరించిందో! ఏమో?

ఫిలిం నగర్ చెట్టు తొర్రలో నుండి అప్పుడే గుడ్డును చీల్చుకుని వచ్చిన మీడియా పక్షి…ప్రేక్షకులతో చెబుతోంది.
“నా జీవితంలో ఇంత పెద్ద ఎన్నికను, ఇంత ఉత్కంఠను చూడలేదు”
కథలో చెట్టు తొర్రలో తల్లి పక్షిలా ప్రేక్షకులు కూడా నవ్వుకుంటున్నారు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

పోస్కో! పోస్కో!

Also Read:

భజన చేసే విధము తెలియండి!

Also Read:

అప్పుడు నోరు విప్పలేదే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్