Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందీలో వైద్య విద్య

హిందీలో వైద్య విద్య

Prescription – Hindi: దేశంలో హిందీ భాషలో వైద్య విద్య ఎం బి బి ఎస్ పాఠాలు బోధించే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం హిందీలో రూపొందించిన వైద్య విద్య పాఠ్యపుస్తకాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అట్టహాసంగా దీనికోసమే ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు.

దేశంలో హిందీని జాతీయ భాషగా ప్రకటించి…ఇంగ్లీషును పక్కకు తోసి హిందీని తప్పనిసరి చేయాలని మొన్ననే అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేయడానికి- మధ్య ప్రదేశ్ లో బి జె పి ప్రభుత్వం వైద్య విద్య పాఠాలను తొలిసారి హిందీలో ప్రచురించడానికి లంకె ఉండనే ఉంటుంది.

ఏ భాష అయినా దానికదిగా గొప్పదీ కాదు, తక్కువదీ కాదు. హిందీలో వైద్య విద్య చదివి భవిష్యత్తులో వైద్యులయ్యేవారిని ఏ రకంగానూ తక్కువ చేయాల్సిన పని కూడా లేదు.

ఎవరి భాష వారికి ముద్దు. కులం, మతం, ప్రాంతం, జాతి, భాషలు మన దేశంలో భావోద్వేగ అంశాలు. రాజకీయాలకు బాగా పనికి వచ్చే విషయాలు. హిందీని దేశమంతా బలవంతగా రుద్దడం ద్వారా బి జె పి ఏమి కోరుకుంటోంది? దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో హిందీ మాట్లాడని ఇతర రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్నది చర్విత చర్వణమవుతుంది.

ఇలాగే…తెలుగులో కూడా వైద్య విద్య పాఠాలను తయారు చేస్తే చూడాలని, చదవాలని నాకు ఆశ. అంటే తెలుగులో ఎం బి బి ఎస్ చదవాలని కాదు. ఆ అర్హత నాకు రాదని తెలుసు. భాషాభిమానిగా ఆ పాఠాల గురించి తెలుసుకోవాలని. అంతే.

తెలుగు మాధ్యమంలో వైద్య పాఠాలు చదివిన వైద్యుడి దగ్గరికి…తెలుగు రోగి వెళితే…వారి మధ్య రోగసంబంధమైన పదహారణాల తెలుగు సంభాషణ ఇలా ఉండవచ్చు.

రోగి:-
నమస్కారమండీ.
వారం రోజులుగా నా కడుపులో ఒకటే నొప్పిగా ఉంటోంది. పడుకుంటే నొప్పి ఇంకా పెరుగుతోంది. తింటే కడుపు ఉబ్బరం. తినకపోతే కళ్లు తిరుగుతున్నాయి. ఊపిరి తిత్తులు బరువెక్కి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. నడుస్తుంటే ఎముకలు విరుగుతున్నట్లు టక్ టక్ మని ఏవో చప్పుళ్లు వినపడుతున్నాయి. మెట్లెక్కుతుంటే గుండె బరువెక్కుతోంది.

వైద్యుడు:-
మీకు కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయాలి. ఆ నివేదికలు వచ్చాక మాధ్యమిక పరీక్షలు అవసరం కావచ్చు. అందులో కూడా ఏమీ తెలియకపోతే...మీ పొట్టలోకి ఒక సన్నని తీగ పంపి…లోపలి దృశ్యాలను ప్రత్యక్షంగా చూడాల్సి రావచ్చు. అప్పుడు కూడా అంతా సాధారణంగా ఉంటే…మీ ఆరోగ్య బీమా అనుమతించినన్ని రోజులు మా ఆసుపత్రిలో అత్యంత విలాసవంతమయిన గదిలో మీరు సేద తీరవచ్చు.

రో:-
అయ్యా!
ఇంతకూ నా రోగం ఏమై ఉంటుంది?

వై:-
పరీక్షల ఫలితాలు వచ్చేవరకు ఏదో ఒక మాయరోగం అనుకుందాం.

రో:-
మాయలు మంత్రాలు గజకర్ణ గోకర్ణ టక్కు టమార వైద్యం కూడా మీరు చదివారా?

వై:-
అవి చదవక్కర్లేదు.

రో:-
మరి మీరు ఏమి చదివారు?

వై:-
నేను తెలుగులో చదివాను.

రో:-
హతవిధీ!
ఈమధ్య తెలుగు భాషా శాస్త్రంలో ఉన్నత చదువులు చదివినవారు కూడా గుండెలు తీసిన బంటుల్లా బరితెగించి గుండెలు కోసే వైద్యులు అవుతున్నారా?
భారత వైద్య మండలి కళ్లు మూసుకుందా?
అడిగే వాళ్లే లేరా?
భాష శాస్త్రమే అయినా వైద్యశాస్త్రం కాదు కదా?
అయినా మనం భాషను శాస్త్రంగా గుర్తించడం ఎప్పుడో మానేశాం కదా?

వై:-
భయపడకండి. మీరు విభక్తి ప్రత్యయాలను సరిగ్గా వినలేదు. నేను వైద్యుడినే. వైద్య పాఠాలను తెలుగులో చదివాను అన్నాను తప్ప...తెలుగు చదివాను అనలేదు.

రో:-
హమ్మయ్య. హడలి చచ్చాను.
తెలుగులో బతికించారు.

వై:-
ప్రధాన ద్వారం ఎడమ పక్కన మెట్లు దిగితే కింద వాహనాలు నిలిపి ఉంచే చోటు ఉంటుంది. అక్కడ మూల మూత్రశాల పక్కన ప్రయోగశాల ఉంటుంది. తిండి తినడానికి ముందు అర సీసా నమూనా రక్తమివ్వండి. పుష్టుగా తిన్న గంట తరువాత మరో అర సీసా నమూనా రక్తం మీరు వద్దన్నా మా వాళ్లే సూది గుచ్చి లాక్కుంటారు. మీరు కడుపుకు అన్నమే తింటున్నారని మాకు నిర్ధారణ కావడానికి మీ ఒకటి, రెండు నమూనాలను మీరే ఎలాగూ పట్టి ఇస్తారనుకోండి.

మీ ఎడమ ఊపిరి తిత్తి ఈశాన్య భాగం బాగా పొగచూరి ఉన్నట్లుంది. మీ గుండె నైరుతి కవాటాల దగ్గర రక్తం పంపిణీ వాటాల్లో తేడాలు వచ్చి ఉండవచ్చు.

మీ రక్తపోటులో ఎగుడు దిగుళ్లు ఉన్నాయి. మీ సిరలు ధమనుల్లో ఎక్కడయినా రక్తప్రసరణకు ఆటంకాలు ఉండి ఉండవచ్చు. మీ పేగుల లోపలి కణత్వచం పుండు పడి ఉండవచ్చు. మీ చిన్న పేగు పెద్ద మనసు చేసుకున్నా…పెద్ద పేగు చిన్నబుచ్చుకుని అలిగి జీర్ణక్రియను అడ్డుకుని ఉండవచ్చు.

Medicine Text Books Hindi

చామన చాయగా ఉన్నానన్న ఆత్మ న్యూనతతో తెల తెల్లగా కావాలని మీరు వాడిన పొడులు, లేహ్యాలు, పైపూతలు మీ చర్మాన్ని తెల్లగా చేయాల్సింది పోయి…లోపల ప్రవహించే ఎర్ర రక్త కణాలను తెల్లవిగా చేశాయి. దాంతో ఇప్పుడు మీకు అత్యవసరంగా లక్ష పలక కణాలు ఎక్కించాలేమో!

ఎండ పొడ తగలక మీ ఎముకలు కూడా బాగా పగుళ్లుబారి ఉన్నాయి. ఎక్కడయినా మరీ పెళుసుగా ఉండి విరుగుతాయి అనుకుంటే…కండ కోసి లోపల ఇనుప దబ్బలు పేర్చి…చీలలు బిగించాల్సి రావచ్చు. అది పైన బొమికల ప్రత్యేక నిపుణుడు చెబుతారు.

రో:-
అయ్యా!  ఇంతకంటే ఎన్నెన్నో రోగాలతో…కొన ఊపిరితో ఎన్నో సార్లు ఆసుపత్రులకు వెళ్లాను కానీ…ఇంత స్పష్టంగా నా మాతృభాషలో నా ఆరోగ్య సమస్యలు వింటుంటే…నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. నేను ఎప్పుడో చచ్చినా…తెలియక బతుకుతున్నట్లు నటిస్తున్నానేమో అని అనిపిస్తోంది. కొంచెం డబ్బు ఎక్కువ తీసుకున్నా పరవాలేదు. నా రోగాల భాషతో పాటు మీ వైద్య పరిభాషను దయచేసి ఆంగ్లంలోనే చెబుతారా? అర్థం కాక… నేను ఆరోగ్యంగానే ఉన్నానన్న భ్రమలో బతికేస్తూ అయినా ఉంటాను.

వై:-
అందుకే రోగాలు తెలుగులో చెప్పకూడదు. అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నప్పుడు…అర్థం కావాల్సింది అర్థం కాకపోయినా పెద్ద ప్రమాదం ఉండదు.

Medicine Text Books Hindi

రో:-
ఇంగ్లీషు వైద్యం అంటే ఏమిటో అనుకున్నాను ఇన్నాళ్లు. ఆ సమాసాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. వైద్యాన్ని ఇంగ్లీషులో చదివి, ఇంగ్లీషులోనే సాధన చేయడం అని ఇప్పుడే తెలిసింది.

వై:-
???
వైద్యుడు తెలుగులో స్పృహదప్పి పడిపోయాడు.

రో:-
అయ్యో! అయ్యో!!
వైద్యుడికి ఎవరయినా ఆంగ్లంలో తక్షణం వైద్యం చేసి పుణ్యం కట్టుకోండి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

హిందీ రుద్దుడు ఏంది?

Also Read :

ఇకపై తమిళ అక్షరంలోనే సంతకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్